ప్రజాస్వామ్య పరిరక్షణకే సంప్రదింపులు

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే డీఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Published : 02 Jun 2023 03:49 IST

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వెల్లడి
తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చర్చలు

చెన్నై, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే డీఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గురువారం చెన్నై విచ్చేసిన ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ ఆయన వెంట ఉన్నారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమైతే రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకోవచ్చని కేజ్రీవాల్‌ తెలిపారు. స్టాలిన్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనీయకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. దిల్లీ సర్కారుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడినా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేవడాన్ని డీఎంకే వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నేతలూ ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సమన్వయం అవసరమని ఆకాంక్షించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని