కాంగ్రెస్‌ 20 రోజుల కార్యాచరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Published : 02 Jun 2023 03:49 IST

‘తెలంగాణ ఇచ్చింది మేమే- తెచ్చింది మేమే’ నినాదంతో ప్రజల్లోకి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ‘తెలంగాణ ఇచ్చింది మేమే- తెచ్చింది మేమే’ నినాదంతో 20 రోజుల కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అమరుల ఆత్మత్యాగాలకు చలించి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన భారాస ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యాలను విస్మరించిందంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తూ.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలతో జనం చెంతకు వెళ్లాలని భావిస్తోంది. నిరుద్యోగ భృతి, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పింఛను, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తదితర హామీలతో పాటు యూత్‌ డిక్లరేషన్‌, రైతు డిక్లరేషన్‌లపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. జూన్‌ 2న రాజీవ్‌గాంధీ యూత్‌.. ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు సోనియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని పార్టీ శ్రేణులకు పీసీసీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

గాంధీభవన్‌లో నేడు జాతీయ పతాక ఆవిష్కరణ

వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద 11 గంటలకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ నివాళులర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, సీనియర్‌ నాయకులు పాల్గొంటారన్నారు. తర్వాత 11.15 గంటలకు నిజాం కళాశాల వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామన్నారు.


రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ శుభాకాంక్షలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం, సోనియాగాంధీ కారణంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో ఘనస్వాగతం

అమెరికా చేరుకున్న రేవంత్‌రెడ్డికి న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డితో పాటు హరియాణా ఎంపీ దీపేందర్‌ హుడా ఉన్నారు. ఈ నెల 4న అమెరికాలో జరిగే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు సమన్వయకర్తగా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని