సీపీఐ ప్రజాగర్జన సభ 11న: కూనంనేని

సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభ తేదీని జూన్‌ 4 నుంచి 11కి మార్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Published : 02 Jun 2023 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభ తేదీని జూన్‌ 4 నుంచి 11కి మార్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారమిక్కడ మగ్దూంభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగూడెంలో సీపీఐ ప్రజాగర్జన సభకు సన్నాహాలు చేసుకుంటున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మా సభ జరిగే ప్రదేశంలోనే జూన్‌ 5న సింగరేణి.. విద్యుత్‌ డేను నిర్వహిస్తోంది. దీంతో మా సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మైదానాన్ని 4వ తేదీ రాత్రికి అప్పగిస్తామని చెప్పినప్పటికీ, సింగరేణి యాజమాన్యం అంగీకరించలేదు. చివరకు ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడినా ఇలా వ్యవహరించడం సరైంది కాదు’ అంటూ మండిపడ్డారు. జాతీయస్థాయిలో మాదిరి భాజపాకు వ్యతిరేకంగా లౌకికపార్టీలన్నీ రాష్ట్రంలో ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో 11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారనీ.. ఇప్పుడేమో 4 లక్షలకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందంటూ తప్పుబట్టారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో కార్మికసంఘ ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను శుక్రవారం నిర్వహించనున్నట్లు కూనంనేని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని