మళ్లీ ముఖ్యమంత్రి వద్దకు బాలినేని

మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి ఏప్రిల్‌ 29న రాజీనామా చేసిన ఆయన మే 2న సీఎంతో భేటీ అయ్యారు.

Updated : 02 Jun 2023 06:32 IST

నెల దాటినా పట్టువీడని మాజీ మంత్రి

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి ఏప్రిల్‌ 29న రాజీనామా చేసిన ఆయన మే 2న సీఎంతో భేటీ అయ్యారు. ‘ఆ పదవిలో కొనసాగాలి.. మీరే ఇలా రాజీనామా చేస్తే పార్టీ శ్రేణులకు ఏం సందేశం వెళుతుంది?’ అని సీఎం నచ్చజెప్పినా ఆయన అప్పుడు వెనక్కు తగ్గలేదు. ఆయన రాజీనామాను సీఎం అంగీకరించనూ లేదు. నెల గడిచాక గురువారం మళ్లీ బాలినేని సీఎంను కలిశారు. ఈ భేటీ తర్వాత కూడా ఆయన ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగుతారా? లేదా? అనేది స్పష్టత రాలేదు. పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్న వారి గురించి బాలినేని సీఎంతో చర్చించినట్లు సమాచారం.

సీఎంతో భేటీ తర్వాత అక్కడే బాలినేని మీడియాతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘నాకు ప్రొటోకాల్‌ కల్పించడంపై సీఎంతో మాట్లాడలేదు. గతంలో మంత్రి పదవినే వదిలేశాను.. ప్రొటోకాల్‌ గురించి తాపత్రయపడక్కర్లేదు. నేనెప్పుడూ పార్టీపై అలకబూనలేదు. పార్టీలోని ఇద్దరు ముగ్గురు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశంపైనే పోరాడుతున్నా. దీనిపై సీఎంతోనూ చర్చించా. సర్దుబాటు చేస్తామని ఆయన హామీనిచ్చారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపైగానీ, కొత్త పోస్టు గురించి కానీ సీఎంతో మాట్లాడలేదు. పార్టీలో ఉన్నవారు కావాలనే ఇలా నాపై మీడియాకు ఇలాంటి విషయాలు చెబుతున్నారు. మా జిల్లాలో ఉన్న సమస్యలు, ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీపైనా సీఎంతో మాట్లాడా. సీఎంను కలుస్తూనే ఉన్నా.. కలుస్తూనే ఉంటా. అలాంటప్పుడు నేను పార్టీ మారుతున్నానని అనడంలో అర్థం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని