కొల్లు రవీంద్ర గృహనిర్బంధం

మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు ఎనిమిది గంటల పాటు గృహనిర్బంధం చేయడంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.

Published : 02 Jun 2023 04:58 IST

నిరవధిక దీక్షకు అల్టిమేటం
మచిలీపట్నంలో ఉద్రిక్తత

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు ఎనిమిది గంటల పాటు గృహనిర్బంధం చేయడంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. నాలుగు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలేనికి చెందిన ముగ్గురు మైనారిటీ యువకులపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలవాలనుకున్న రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలిసి పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. తనను గృహనిర్బంధం చేయడంపై రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రహదారిపై బైఠాయించారు.

అరెస్టు చేయకుంటే నిరవధిక దీక్ష

తెదేపా సానుభూతిపరులపై దాడిచేసిన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే బుధవారం ఉదయం నుంచి తాను నిరవధిక దీక్ష చేస్తానని పోలీసులకు రవీంద్ర అల్టిమేటం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఆదేశాల వల్లే అరెస్టు చేయట్లేదని ఆరోపించారు. ఉపయోగం లేని ఎఫ్‌ఐఆర్‌ల వల్ల ప్రయోజనం ఏముందని ఆ కాపీని చింపేశారు. దాడికి గురై చికిత్స పొందుతున్నవారికి ఏదైనా జరిగితే అందుకు పోలీసులే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎస్పీ నేరుగా ఫోన్‌లో రవీంద్రతో మాట్లాడారు. సహకరించాలని కోరగా తమ ఇంటికి పోలీసులను పంపి లేనిపోని అలజడి సృష్టించారని, వారు వెనక్కి వెళ్తే తాము నిరసన విరమించుకుంటామని రవీంద్ర చెప్పారు. డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

నిందితుల అరెస్ట్‌

ఇంగ్లీష్‌పాలెంలో గత నెల 28వ తేదీ రాత్రి తెదేపా సానుభూతిపరులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేయకపోవడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు నిరవధిక దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో పోలీసు అధికారులు నిందితులు ఎండీ కర్మతుల్లా, ఎండీ మొబిన్‌, షేక్‌ రోషన్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని