Andhra News: ప్రొద్దుటూరులో వైకాపా కవ్వింపు

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో గురువారం తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడింది.

Updated : 02 Jun 2023 06:26 IST

లోకేశ్‌ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు  
దారులు తవ్వేసి.. ఇసుక, కంకర నింపేసి..
వివేకా హత్యపై ప్లకార్డులు ప్రదర్శించిన లోకేశ్‌
కూడదన్న పోలీసులు.. నిలదీసిన యువనేత

ఈనాడు డిజిటల్‌, కడప: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో గురువారం తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాదయాత్ర మార్గంలో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, రహదారులను తవ్వేయడం, ఇసుక, కంకరతో నింపేయడంతో తెదేపా నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. లోకేశ్‌ రోడ్లను తవ్వేసిన మార్గంలో కాకుండా మరో మార్గంలో తిరిగారు. రాత్రి లోకేశ్‌పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరగా ఆయన భద్రతా సిబ్బందిపై పడింది. రాచమల్లు ఫ్లెక్సీలపై నోరు మెదపని పోలీసులు లోకేశ్‌ ఫ్లెక్సీలను ప్రదర్శించడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయన గట్టిగా నిలదీయడంతో వెనుదిరిగారు. ‘అబ్బాయి... బాబాయిని చంపాడు’ పేరిట మాజీమంత్రి వివేకాతో పాటు సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి చిత్రాలతో ముద్రించిన ప్లకార్డును లోకేశ్‌ ప్రదర్శించారు. ‘బాబాయ్‌ను లేపేసింది ఎవరు?’ అంటూ ప్రజలను అడిగి వారి నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న తెదేపా కార్యకర్తలను వారిస్తూ డీఎస్పీ నాగరాజు లోకేశ్‌ వద్దకు చేరుకున్నారు. ‘అన్ని అనుమతులు తీసుకుని మేం యాత్ర చేస్తున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టేలా వైకాపా వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు?’ అని ఆయన డీఎస్పీని నిలదీశారు. వారి ఫ్లెక్సీలను తొలగిస్తే తాము ప్లకార్డుల ప్రదర్శన ఆపేస్తామని లోకేశ్‌ అన్నారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాదయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మహిళలు అడుగడగునా హారతులు పట్టారు. లోకేశ్‌ పలుచోట్ల తన కోసం వేచి ఉన్నవారి వద్దకు వెళ్లి పలకరించారు. 

సొంత పత్రికుందని ఏదైనా రాస్తారా?

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘కడపవాసులను ఒకటి అడగదలుచుకున్నా.. హూ కిల్డ్‌ బాబాయ్‌?’ అంటూ ప్రశ్నించారు. ‘సొంత పత్రిక, ఛానల్‌ ఉన్నాయని.. బాబాయ్‌ హత్యపై కట్టుకథలు అల్లారు. నారాసుర చరిత్ర అని రాశారు. బాబాయ్‌ ఆత్మ వెంటాడింది. అది జగనాసుర రక్త చరిత్ర అని తేలిపోయింది. అబ్బాయిలే బాబాయ్‌ను చంపేశారని.. చెల్లే రహస్యంగా సాక్ష్యం చెప్పింది. కేసు నుంచి బయటపడటానికి దిల్లీ వెళ్లి అందరి కాళ్లు పట్టుకుంటున్నారు జగన్‌’ అని ఆరోపించారు. ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. గ్యాంబ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా, గుట్కా, దొంగనోట్లు, ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేశారని లోకేశ్‌ ఆరోపించారు.


లోకేశ్‌పై కోడిగుడ్డుతో దాడి

గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డు మార్గంలో లోకేశ్‌ పాదయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరగా, భద్రతా సిబ్బందిపై పడింది. దీంతో లోకేశ్‌ నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వారి తీరును దుయ్యబట్టారు. వైకాపా కవ్వింపు చర్యలపై చర్యలు తీసుకోనందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని తెదేపా కార్యకర్తలు పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని