జనంలోకి పవన్‌కల్యాణ్‌

‘‘జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్‌ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత ఈ పర్యటన మొదలవుతుంది.

Updated : 03 Jun 2023 06:33 IST

జూన్‌ 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో.. 11 నియోజకవర్గాల రూట్‌మ్యాప్‌ ఖరారు
జనసేన నేత మనోహర్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘‘జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్‌ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత ఈ పర్యటన మొదలవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు ఉండి ప్రజలతో మమేకమై.. అక్కడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. జనసైనికులు, వీర మహిళలతో సమావేశమవుతూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గానికో బహిరంగ సభ కూడా ఉంటుంది’’ అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జనసేన నాయకులు, పీఏసీ సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు చేసినట్లు వెల్లడించారు.

ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, అక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం వరకు మార్గం ఖరారైందని మనోహర్‌ వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటుచేసుకుని తదుపరి రూట్‌మ్యాప్‌ ఖరారు చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు తదితరులతో సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి జనసేన తరఫున ప్రణాళిక సిద్ధం చేసేలా ఈ పర్యటన ఉంటుందని మనోహర్‌ వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న సమస్యను ప్రత్యక్షంగా పరిశీలిస్తారన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఇది ఎన్నికల ర్యాలీ లాంటిది కాదని, ప్రజలకు దగ్గరయ్యేందుకు, సమస్యలు తెలుసుకోవడానికి చేపడుతున్న కార్యక్రమమని మనోహర్‌ పేర్కొన్నారు. కళాకారులు, కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, మత్స్యకారులతో, చేనేత వృత్తివారితో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పొత్తు ఆలోచనలో భాగంగానే ఉభయగోదావరి జిల్లాల్లో రూట్‌మ్యాప్‌ ఖరారు చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ కాదని, జనసేన పార్టీ బలోపేతానికి చేస్తున్న యాత్ర అని పేర్కొన్నారు. తమ యాత్రకు పోలీసుల సహకారం కూడా అవసరమని, తాము ఎప్పుడూ వారికి సహకరిస్తూనే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే రాజకీయ పార్టీగా తమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామన్నారు. ఈ యాత్ర తర్వాత మళ్లీ ఆయన షూటింగులకు వెళ్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘‘పవన్‌కల్యాణ్‌ కష్టం, ఆయన సంపాదించిన నిధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసైనికుల సాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయన సినిమాల ద్వారా వచ్చే ఆదాయం పార్టీకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. సందర్భం వచ్చినప్పుడు పూర్తిస్థాయి సమయం రాష్ట్ర ప్రజలు, రాష్ట్రాభివృద్ధి కోసమే కేటాయిస్తానని పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే చెప్పారు. అవసరమైతే షూటింగులకు ఇచ్చిన కమిట్‌మెంట్లు కూడా పక్కన పెట్టి కూడా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని మనోహర్‌ చెప్పారు. పార్టీ మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కందుల దుర్గేష్‌, కొటికలపూడి గోవిందరావు, కనకరాజు సూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు