కేసుల మాఫీకి కేంద్రంతో లాలూచీ

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్ని, చట్టంలో పొందుపరిచిన అంశాల్ని నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌... ఆయనపై ఉన్న కేసులు మాఫీ చేస్తే చాలు, సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపకుండా ఉంటే చాలనుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 03 Jun 2023 02:54 IST

ప్రత్యేక హోదాను జగన్‌ తాకట్టు పెట్టారు
నాలుగేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు
కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. పైరవీలకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్ని, చట్టంలో పొందుపరిచిన అంశాల్ని నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌... ఆయనపై ఉన్న కేసులు మాఫీ చేస్తే చాలు, సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపకుండా ఉంటే చాలనుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని బీరాలు పలికిన జగన్‌... ఆ పని చేయకపోగా, తనపై ఉన్న కేసుల విషయంలో పైరవీలు చేసేందుకు, కోర్టుల్లో వాదించేందుకు, మధ్యవర్తిత్వం నెరిపేందుకు మూడు రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్లయినా... రాజధాని లేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ‘‘జగన్‌ బ్యాచ్‌ వ్యాపారం చేసుకోవడానికే ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చినట్టు ఉంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత బరితెగించలేదు. అమరావతిని నాశనం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. విశాఖ రైల్వే జోన్‌ లేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లు లేవు. కడప ఉక్కు లేదు. విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లు పోయాయి’’ అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి... జూన్‌ 2కి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. విభజన సమస్యలను రెండు రాష్ట్రాలు సయోధ్యతో పరిష్కరించుకోవాలన్నారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రావల్సిన వాటిని కేంద్రం వెంటనే ఇవ్వాలన్నారు. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు, రూ.1.10 లక్షల కోట్ల అప్పు, 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతతో ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రను ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎలా అగ్రగామిగా నిలిపిందీ ఆయన లెక్కలతో వివరించారు. ఆరంభ కష్టాలన్నింటినీ అధిగమించి, ఇక పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని... జగన్‌ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో అవినీతి, దోపిడీ, అస్తవ్యస్త విధానాలతో భ్రష్టు పట్టించిందని చంద్రబాబు మండిపడ్డారు.

2025కి పోలవరం తొలిదశ పూర్తిచేస్తారా... సిగ్గులేదా?

పోలవరం ప్రాజెక్టును తెదేపా ప్రభుత్వం 72% పూర్తిచేస్తే... రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టునే రివర్స్‌ చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2025 జూన్‌కి మొదటిదశ పూర్తిచేస్తామని చెబుతున్నారని, వైకాపా ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు. తెదేపా అధికారంలో కొనసాగి ఉంటే 2020 జూన్‌కే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. వైకాపా అధికారంలో కొనసాగితే మరో 30-40 ఏళ్లయినా ప్రాజెక్టు పూర్తవడం అనుమానమేనన్నారు. ‘‘తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.64వేల కోట్లు ఖర్చుపెట్టింది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి, వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేయాలని తెదేపా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తే... జగన్‌ అధికారంలోకి వచ్చాక మొత్తం నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తామని చెబుతున్నారు. ప్రాజెక్టు ఉద్దేశం అది కాదు. 45.72 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టును నిర్మిస్తేనే 170 టీఎంసీలకు పైగా జలాలు నిల్వ ఉంటాయి’’ అని తెలిపారు. నదుల అనుసంధానం చేసి, గోదావరి జలాల్ని బనకచర్ల వరకు తీసుకెళితే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చన్నారు.

రాజధాని ఏంటో చెప్పలేని హీనస్థితికి తెచ్చారు

రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన దూరంలో ఉండేలా... రాజధానిని ప్రతిపాదిస్తే వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని, రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. 1200 రోజులకు పైగా రాజధానిలోని ఆడబిడ్డలు ఎండనక, వాననక రోడ్లపై పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిపై దమనకాండకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పేటీఎం బ్యాచ్‌ తలెక్కడ పెట్టుకుంటుంది?

‘‘2019లో ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం రూ.66,786 కోట్లు ఉంటే, తెలంగాణ ఆదాయం రూ.69,620 కోట్లు. 2023లో ఏపీ ఆదాయం రూ.94,916 కోట్లు ఉంటే... తెలంగాణ ఆదాయం రూ.1,32,175 కోట్లకు పెరిగింది. అంటే ఏపీ కంటే రూ.37,259 కోట్లు ఎక్కువ. ఈ నాలుగేళ్లలో ఏపీ ఇంతగా వెనుకబడటానికి కారణమెవరు? ప్రతిదానికీ ఎగిరెగిరి పడే వైకాపా పేటీఎం బ్యాచ్‌ తలెక్కడ పెట్టుకుంటుంది?  మద్యం, ఇసుక దోపిడీ, భూముల దందాలు, సెటిల్‌మెంట్లలో రూ.వేల కోట్లు దోచుకోవడం, ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసుల్లో అరెస్టు చేయించడం, ఇళ్లు ఎటాచ్‌ చేయడం వంటివి తప్ప జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి చేసిందేంటి?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిందని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. అవి ఆచరణలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రానికి రూ.6లక్షల కోట్ల పెట్టుబడులు, 5.13 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే శాసనమండలిలో వెల్లడించిందని తెలిపారు. ‘‘వైకాపా అధికారంలోకి రావడంతోనే తిరోగమనం మొదలైంది. ఎఫ్‌డీఐలు లేవు. ఐటీ ఎగుమతులు 0.2 శాతం మాత్రమే’’ అని మండిపడ్డారు. 2014-19 మధ్య ఐదేళ్లలో ఏపీ 10.8% వృద్ధిరేటు, వ్యవసాయంలో 11% వృద్ధి సాధించామన్నారు.

2047కి ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యం

సంక్షేమ పథకాల అమల్లో పోటీ రాష్ట్రానికి మేలు చేస్తుందా? అన్న ప్రశ్నకు.. కచ్చితంగా చేస్తుందని చంద్రబాబు బదులిచ్చారు. సంక్షేమంతో పాటు సంపదా సృష్టిస్తామని, పేదలందరినీ ధనవంతుల్ని చేసేందుకే పూర్‌ టు రిచ్‌ కాన్సెప్ట్‌కి రూపకల్పన చేశామని వివరించారు. 2047 నాటికి రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణం తెదేపా బాధ్యతగా పేర్కొన్నారు.


ఆయనో గొప్ప మేధావి కదా మరి..

మహానాడులో మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన పథకాల్ని ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారని జగన్‌ అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు... ‘‘ఆయనో గొప్ప మేధావి మరి. ఎక్కడ చదువుకొచ్చాడో తెలీదు. ప్రపంచంలోనే అత్యున్నత యూనివర్సిటీలో చదివానంటారు. దానిపేరు మాత్రం ఎవరికీ తెలీదు. ఆయనో ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త కదా. ఆయన బాధ్యత బాబాయిని గొడ్డలితో లేపేయడం..! ఇలాంటి వాళ్లంతా రాజకీయాలు చేస్తున్నారు. ఉపన్యాసాలు చెబుతున్నారు. మేం కర్ణాటకను చూసి కాపీ కొట్టామంటున్నారు. బిసిబేళి బాత్‌ని, పులిహోరని మిక్స్‌ చేశామంటున్నారు. బిసిబేళిబాత్‌ పౌష్టికాహారం. పులిహోర రుచిగా ఉంటుంది. రెండూ కలిపామంటే.. మా మేనిఫెస్టో బాగుందని అంగీకరించినట్టే కదా?’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని