తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది సోనియానే
తెలంగాణ సమస్యలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రమే అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు.
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్
గాంధీభవన్, నారాయణగూడ, బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: తెలంగాణ సమస్యలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రమే అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా.. ఇక్కడి పరిస్థితులు మారనందుకు బాధగా ఉందన్నారు. తెలంగాణ ఉధ్యమ ఆకాంక్షలు నెరవేర్చేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని, ఇక్కడ తమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు నాయకులంతా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గద్దర్ పాడిన పాటతో సభ ప్రారంభమైంది. మీరాకుమార్‌కు మహిళలు బోనంతో స్వాగతం పలకగా ఆమె బోనం ఎత్తుకున్నారు. వేదికపై జై తెలంగాణ అని నినదించి, తెలుగుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ప్రసంగించారు. ‘దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించినా, ప్రాణ త్యాగాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. చివరికి ప్రజల బాధ, ఆవేదనను గుర్తించి.. వారి ఆకాంక్షలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ఆమె వెనుకాడలేదు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన లక్ష్యాలుగా ఉద్యమం జరిగింది. కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో అవేవీ నెరవేరలేదు.
నిరుద్యోగులు, రైతులు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాస్త పక్కకు వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న దుర్భర పరిస్థితులు చూసి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బాధపడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారి సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది. మీరు ఎప్పుడు పిలిచినా తెలంగాణకు వచ్చేస్తా’ అని మీరాకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘నియామకాలు జరపకపోవడంతో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’ అన్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం ఏర్పాటును అపహాస్యం చేసిన భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు కేసీఆర్ పార్లమెంటులోనే లేరు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మీరా కుమార్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ ఓటేశారు’ అని విమర్శించారు. ఈ సందర్భంగా మీరాకుమార్‌తో పాటు తెలంగాణ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ తదితరులను, ఉద్యమకారులను సన్మానించారు. నాయకులు వీహెచ్, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహా, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, వినోద్‌రెడ్డి, జి.నిరంజన్, చెరుకు సుధాకర్, రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి, మీరాకుమార్ కుమారుడు అక్షుల్ అభిజిత్, సునీతారావు మాట్లాడారు.
* మీరాకుమార్ తొలుత ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో కలిసి గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యకర్తల ర్యాలీని ఆమె ప్రారంభించారు. అక్కడి నుంచి గన్‌ఫౌండ్రి వరకు ర్యాలీ సాగింది.
అంతకుముందు ఉదయం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కటౌట్‌కు నదీమ్ జావిద్, బల్మూరి వెంకట్, రోహిన్‌రెడ్డి తదితరులు పాలాభిషేకం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్