రాష్ట్రంలో అవినీతి మాఫియా

తెలంగాణ ఒక వ్యక్తితోనో.. ఓ కుటుంబం కారణంగానో రాలేదని.. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన 1,200 మంది అమరుల వల్లే ఆ కల సాకారమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 03 Jun 2023 06:08 IST

ఓ కుటుంబానికి మాత్రమే   పరిమితమైన బంగారు తెలంగాణ
అధికారం చేపట్టి నీతిమంతమైన  పాలన అందిస్తాం: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, గోల్కొండ: తెలంగాణ ఒక వ్యక్తితోనో.. ఓ కుటుంబం కారణంగానో రాలేదని.. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన 1,200 మంది అమరుల వల్లే ఆ కల సాకారమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పలా         మారిందని ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులే రూ.1.30 లక్షల కోట్లున్నాయని అన్నారు. తెలంగాణను పాలకులు ఇసుక మాఫియా, భూ మాఫియా, లీకేజీల మాఫియా... ఇలా మొత్తం అవినీతి మాఫియాగా మార్చారని ఆరోపించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన రాష్ట్రావతరణ దిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘‘ఫ్లైఓవర్లు నిర్మించి ఇదే అభివృద్ధి అనడం సబబుకాదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమస్యలను పాలకులు చూడాలి. కేజీ టు పీజీ విద్య ఎక్కడికి వెళ్లింది? దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న వాగ్దానం ఎందుకు అమలు పరచలేదు? రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే... ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఒక కుటుంబం లబ్ధి పొందడం కోసం రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తంగా మార్చారు. ఇందుకు ఉదాహరణ రూ.లక్షల కోట్లు అప్పులు చేయడమే. బంగారు తెలంగాణ ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైంది.

జీవో 111 రద్దు వెనుకా కుంభకోణాలు

అధికారం చేపట్టిన అనంతరం ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలు, ప్రభుత్వ భూములను తెగనమ్మడం, ధరణి ముసుగులో అక్రమాలకు తెరతీయడం, ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. జీవో 111 రద్దు వెనుకా కుంభకోణాలున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరుబాట పట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు ఇచ్చిన ప్రధాని

తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి కొన్ని రూ.లక్షల కోట్ల నిధులను ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చారు. తెలంగాణలో రూ.1.20లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిని సిమెంట్‌ రహదారిగా మార్చుతున్నాం. తెలంగాణలో పేదల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన మౌలిక సదుపాయాలవల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి కొత్తగా రెండు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించాం. హైదరాబాద్‌-విశాఖపట్నం, శంషాబాద్‌-కర్నూలు-విశాఖపట్నం మార్గాల్లో స్పీడ్‌ ట్రైన్లను నడిపేందుకు సర్వే చేపట్టాం. తెలంగాణలో అధికారం చేపట్టి నీతివంతమైన పాలన అందిస్తాం’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. ఈ వేడుకల్లో నేతలు ఏవీఎన్‌ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో యాదిరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, దయాకర్‌రెడ్డి, సిరిపురం యాదయ్య అమరులవగా వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు