ఉద్యోగాలపై చర్చకు సిద్ధం: మంత్రి జగదీశ్‌రెడ్డి

భాజపా పాలన కొనసాగుతున్న గుజరాత్‌తో తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా... అని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Updated : 03 Jun 2023 05:52 IST

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: భాజపా పాలన కొనసాగుతున్న గుజరాత్‌తో తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా... అని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సూర్యాపేటలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటూ గొప్పలకు పోతున్న కేంద్రం గుజరాత్‌లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే... దేశంలోని మొత్తం భాజపా పాలిత రాష్ట్రాల్లో కలిపి ఇచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువ. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై కిషన్‌రెడ్డికి ప్రేముంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చాక మాట్లాడాలి. సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్‌ వెంటే నడుస్తోంది. 2023 ఎన్నికల్లోనూ గత రెండు ఎన్నికల్లో జరిగిందే పునరావృతం అవుతుంది’’ అని ధీమా వ్యక్తంచేశారు.

కిషన్‌రెడ్డికి అభివృద్ధి కనిపించట్లేదా?: పీయూసీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఇదివరకెలా ఉండే... ఇప్పుడెలా ఉందనే విషయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కనిపించట్లేదా? అని పీయూసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల పేరిట కిషన్‌రెడ్డి నీచ రాజకీయం చేశారు. భారాస ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. కాదని నిరూపిస్తే మేం రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. నిరూపించకుంటే కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి’’ అన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, నిజామాబాద్‌ మేయర్‌ నీతూ కిరణ్‌, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని