విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ నివేదికలను బహిర్గతం చేయాలి

విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో భూముల అక్రమాలపై విచారణ జరిపిన సిట్‌ నివేదికలను బహిర్గతం చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కోరారు.

Published : 03 Jun 2023 04:47 IST

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఎంపీ జీవీఎల్‌ వినతి

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో భూముల అక్రమాలపై విచారణ జరిపిన సిట్‌ నివేదికలను బహిర్గతం చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అక్రమాలపై జోక్యం చేసుకోవాలని  కోరారు. భూ కుంభకోణాలపై గత తెదేపా, ప్రస్తుత వైకాపా ప్రభుత్వాలు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించాయని అవి ఇచ్చిన నివేదికలను ఇప్పటి వరకు బహిర్గతం చేయకుండా ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా వాటిని ఉంచాయని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. వీటిని బహిర్గతం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.

త్వరలో పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు త్వరలో రూ.12,911 కోట్లను కేంద్రం ఇవ్వనుందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పోలవరానికి అవసరమైన నిధులు, అనుమతులు ఇచ్చేందుకు, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. గత తొమ్మిదేళ్లలో కేంద్రం రూ.55వేల కోట్ల నరేగా నిధులు ఇచ్చింది. రెవెన్యూ లోటు కింద రూ.10వేల కోట్లు, స్పెషల్‌ ఇన్సింటెవ్‌ ప్యాకేజీ రూపంలో రూ.10వేల కోట్లకుపైగా ఇచ్చారు. ఈ నిధులను తెచ్చుకున్న రాష్ట్రప్రభుత్వం.. తామేదో ప్రజలకు సేవ చేసినట్లు చెబుతోంది. 2016 నుంచి ఇప్పటివరకు అదనపు రుణం కింద రూ.16,984 కోట్లను గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెచ్చుకున్నాయి. దీంతో అప్పులపై కేంద్రం పరిమితులు విధించింది. ఈ ఏడాది కూడా రూ.8వేల కోట్ల వరకు కోత విధించాల్సి ఉన్నా... రాష్ట్రప్రభుత్వ కోరిక మేరకు మూడేళ్లలో సర్దుబాటు చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఛార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తాం’ అని తెలిపారు.

8న విశాఖకు అమిత్‌షా, 10న తిరుపతికి నడ్డా

కేంద్రమంత్రి అమిత్‌షా ఈ నెల 8న విశాఖ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 10న తిరుపతికి రానున్నారు. ఈ రెండు నగరాల్లో జరిగే బహిరంగసభల్లో వీరు పాల్గొంటారు. ఈ మేరకు భాజపా రాష్ట్రశాఖ ఓ ప్రకటన జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని