తెలంగాణలోనూ విజయం మాదే

త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో భాజపా ఆనవాళ్లు కూడా ఉండవని వ్యాఖ్యానించారు.

Published : 05 Jun 2023 02:56 IST

ఎన్నికలయ్యాక అక్కడ భాజపా మాయం
4 రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే
న్యూయార్క్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

న్యూయార్క్‌: త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో భాజపా ఆనవాళ్లు కూడా ఉండవని వ్యాఖ్యానించారు. ద్వేషపూరిత భావజాలంతో పనిచేస్తున్న భాజపాను ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఓడించనున్నారని ఆయన అన్నారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్‌-అమెరికా విభాగం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లోనూ అదే జరుగుతుందన్నారు. దేశంలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని.. ఈ సైద్ధాంతిక యుద్ధంలో కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు. ‘భాజపాను ఘోరంగా ఓడించగలమని మేం కర్ణాటకలో నిరూపించాం. కేవలం ఓడించడం కాదు.. ఆ పార్టీని తుడిచిపెట్టేశాం.. ఛిన్నాభిన్నం చేశాం’ అని వ్యాఖ్యానించారు. ‘కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా అన్ని రకాలుగా ప్రయత్నించింది. మా కంటే అన్ని రకాల వనరులు ఎన్నో రెట్లు అధికంగా ఉన్న ఆ పార్టీని ప్రజాబలంతో మట్టి కరిపించాం’ అని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కార్యక్రమాలపై చిత్రప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నేతలు మధుయాస్కీ, పొన్నాల లక్ష్మయ్య, మదన్‌ మోహన్‌, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా న్యూయార్క్‌ నగరంలోని బ్రాడ్‌వే ప్రాంతంలో బిల్‌బోర్డుపై తెలంగాణ కాంగ్రెస్‌ కార్యక్రమాలతో ప్రచారచిత్రం ప్రదర్శన ఏర్పాటు చేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాసులతో కలసి రేవంత్‌రెడ్డి ఈ ప్రదర్శనను తిలకించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి సహకరించాలని వారిని రేవంత్‌ కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు