మోదీజీ.. రైల్వే రక్షణ మీద దృష్టేది?

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.

Published : 05 Jun 2023 04:50 IST

ప్రధానిని నిలదీసిన మల్లికార్జున ఖర్గే

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కొత్త రైళ్ల ప్రారంభంపై ఆసక్తి చూపే ప్రధాని రైల్వే రక్షణపై దృష్టి సారించడంలేదని ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి నుంచి కింది వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ జవాబుదారీతనాన్ని నెలకొల్పాలని వరుస ట్వీట్లలో సూచించారు. రైల్వేలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, చివరికి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా భర్తీ కావలసిన ఉన్నత స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో వీటిని ఎందుకు భర్తీ చేయలేదో తెలపాలని డిమాండ్‌ చేశారు. అవసరమైనంత మంది సిబ్బంది లేకపోవడంతో లోకో పైలట్లు ఎక్కువ సమయం పనిచేయాల్సిరావడం ప్రమాదాలకు కారణమవుతోందని రైల్వే బోర్డు పేర్కొనడాన్ని ఖర్గే ప్రస్తావించారు. రైల్వే భద్రత కమిషన్‌ సిఫారసులను రైల్వే బోర్డు పరిగణనలోకి తీసుకోకపోవడంపై రైల్వేలపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయి సంఘం తన 323వ నివేదికలో విమర్శించిన సంగతిని ఖర్గే ఉటంకించారు.


ప్రధాని.. అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామాను కోరాలి

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణం కోరాలి. 270 మందికి పైగా చనిపోయినప్పటికీ జవాబుదారీతనం కనిపించడంలేదు. ఇంతటి విషాదకర ప్రమాదానికి బాధ్యత వహించకుండా మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదు.

రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత


నైతిక బాధ్యత తీసుకోవాలి

నైతిక బాధ్యతతో గతంలో రాజీనామా చేసిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి, నీతీశ్‌ కుమార్‌, మాధవ్‌రావ్‌ సింధియాలను ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అనుసరించాలి. ఆయన తప్పక తన పదవిని వదిలిపెట్టాలి.

ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి


రైల్వే మంత్రి రాజీనామా చేయాలి

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన పదవికి రాజీనామా చేయాలి. మంత్రి ప్రచార గిమ్మిక్కులతో భారతీయ రైల్వేలోని తీవ్రమైన లోపాలు, నేరపూరితమైన నిర్లక్ష్యం, భద్రత లొసుగులు మరుగునపడిపోయాయి. తాజా విషాదఘట్టంలో తన బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాలి.

పవన్‌ ఖేడా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి


ఒక్క మంత్రికి అన్ని పెద్ద శాఖలా?

కేంద్ర ప్రభుత్వంలో అశ్వినీ వైష్ణవ్‌.. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా, రైల్వే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒక్క మంత్రి అన్ని భారీ శాఖలు నిర్వహించలేరు. రైల్వే బడ్జెట్‌ లేదు. జవాబుదారీతనం లేదు. రైల్వే భద్రత కోసం ఏటా రూ.అయిదు వేల కోట్లను కేటాయించలేకపోతున్నారు.

కపిల్‌ సిబల్‌, రాజ్యసభ సభ్యుడు


కాగ్‌ సిఫారసులు అమలు పరచలేదేం?

దేశంలో రైలు ప్రమాదాల నివారణకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2022లో చేసిన సిఫారసులను ఎందుకు అమలు పరచలేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయడానికి ఆ నిర్లక్ష్యం చాలదా?

క్లిడే క్రాస్టో, ఎన్‌సీపీ అధికార ప్రతినిధి


రాజకీయం చేయొద్దు

దురదృష్టవశాత్తూ జరిగిన ఒడిశా రైలు ప్రమాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. ప్రస్తుతం మమల్ని సహాయ, ఉపశమన కార్యక్రమాలు చేపట్టనివ్వండి. అలాగే ఆ మార్గంలో తిరిగి రైళ్లు నడిచేలా పనులు చేయనివ్వండి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు గొప్పదేమీ కాదు. అలాంటివారు అత్యంత అర్హత కలిగిన రైల్వే మంత్రి రాజీనామాను కోరుతున్నారు.

అమిత్‌ మాలవీయ, భాజపా ఐటీ విభాగాధిపతి


నా హృదయం ముక్కలైంది

భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన వల్ల ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది.

జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని