రాష్ట్రంలో దౌర్భాగ్య పరిపాలన

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిపాలన కొనసాగుతోందని, దీన్ని అంతమొందించేందుకు అందరూ నడుం బిగించాలని మాజీ మంత్రి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Jun 2023 05:01 IST

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దౌర్భాగ్య పరిపాలన కొనసాగుతోందని, దీన్ని అంతమొందించేందుకు అందరూ నడుం బిగించాలని మాజీ మంత్రి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌, వార్డు వాలంటీరుల ఆధ్వర్యంలో మూడంచెల పాలన సాగుతోందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఎలాంటి అధికారాలు లేవని వ్యాఖ్యానించారు. వాలంటీరుకున్న అధికారం ఎమ్మెల్యేకు లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వాలంటీర్లను నిర్వీర్యం చేసి పార్టీపరంగా గృహసారథుల వ్యవస్థను తెచ్చి వారికి సర్వాధికారాలూ ఇచ్చారని గుర్తుచేశారు. శాసనసభ సమావేశాలు గతంలో 70 రోజులు జరిగేవని, నేడు 20 రోజులు కూడా జరగడం లేదని పేర్కొన్నారు. అన్నీ క్యాంపు కార్యాలయాల్లో జరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఏఎస్‌ఆర్‌ సోమశిల హైలెవల్‌ కాలువ మొదటి దశ పనులు నాలుగేళ్లుగా ఆగిపోయాయని, మొదటి రిజర్వాయర్‌లోనే సెంటు భూమి సేకరించకుండా రెండో దశ పనులు ఎవరి ప్రయోజనాల కోసం చేపట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చీప్‌ లిక్కర్‌లో విష పదార్థాలున్నాయని, దానికి అలవాటు పడిన వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చినా రూపాయి ఆస్తి రాష్ట్రంలో పెరిగిందా అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్‌ను ఏం చేశారని నిలదీశారు. నష్టపోయిన కుటుంబాలకు ఇళ్లు కూడా కట్టించలేదని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని