సంక్షిప్త వార్తలు (6)

పాదయాత్రతో దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరిచానంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం చేసుకోవడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు.

Updated : 06 Jun 2023 06:13 IST

రాహుల్‌వి విద్వేష దుకాణాలు: నడ్డా

దిల్లీ: పాదయాత్రతో దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరిచానంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం చేసుకోవడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. రాహుల్‌ నడుపుతున్నవి విద్వేష దుకాణాలని పేర్కొన్నారు. భారత్‌ ఎప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పినా కాంగ్రెస్‌ యువరాజు జీర్ణించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.


విపక్షాల భేటీకి పార్టీల అధినేతలే రావాలి.. నీతీశ్‌ కుమార్‌ స్పష్టీకరణ

పట్నా: త్వరలో పట్నాలో నిర్వహించనున్న విపక్షాల భేటీకి ఆయా పార్టీల అధినేతలే రావాలని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వారికి బదులుగా పార్టీ ప్రతినిధులు రావడాన్ని అంగీకరించబోమన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 12న జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తదుపరి ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాత ప్రకటిస్తామన్నారు. ‘‘ఈనెల 12వ తేదీ భేటీకి హాజరవడానికి తమకు వీలుపడదని కాంగ్రెస్‌తోపాటు మరో పార్టీ తెలిపాయి. అందుకే అన్ని పార్టీలను సంప్రదించి, కొత్త తేదీని ప్రకటిస్తాం.  సమావేశానికి కాంగ్రెస్‌ నుంచి అధ్యక్షుడు కాకుండా ఇంకెవరో ప్రతినిధులు వస్తారన్న అభిప్రాయం ఉంది. ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది. అందుకే పార్టీల అధినేతలే రావాలని మేం స్పష్టంచేశాం’’ అని వెల్లడించారు.


సీఎం జగన్‌ కేసులను సత్వరం విచారించాలి

హైకోర్టును ఆశ్రయించనున్న హరరామజోగయ్య

పాలకొల్లు, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులను సత్వరం విచారించి ఆయన దోషా.. నిర్దోషా అనేది తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు మాజీ ఎంపీ చేగొండి వెంకటహరరామజోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించి పదేళ్లు దాటినా.. సీఎంపై ఉన్న కేసుల్లో సీబీఐ కోర్టు రోజువారీ విచారణ ఎందుచేత చేపట్టడం లేదో తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ కేసుల్లో తీర్పును బట్టే 2024లో జరగనున్న ఎన్నికల్లో జగన్‌ మరోసారి పోటీ చేయడానికి అర్హుడా కాదా అనేది ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నీతిమంతులను మాత్రమే చట్టసభలకు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లకు ఉన్నందున ఈ రాష్ట్రంలో ఒక ఓటరుగా న్యాయం కోసం తాను తెలంగాణ హైకోర్టు తలుపులు తట్టనున్నట్లు జోగయ్య వెల్లడించారు.


14 నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 14, 15, 16, తేదీల్లో చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తారని స్థానిక నేతలు తెలిపారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ‘నాలుగు మండలాల్లో నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారు. కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘లక్ష్యం లక్ష ఓట్ల మెజార్టీ’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించే విధంగా పర్యటన షెడ్యూలును రూపొందిస్తున్నాం’ అని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సోమవారం ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.


జనసేన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల అందజేత

ఈనాడు, అమరావతి: వివిధ ప్రమాదాల్లో మరణించిన జనసేన కార్యకర్తలు.. వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన గొల్ల గురుబ్రహ్మ, పెడన నియోజకవర్గం నీలిపూడికి చెందిన బుద్ధన పవన్‌కుమార్‌ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సోమవారం మంగళగిరిలో అందజేశారు. వేర్వేరు ప్రమాదాల్లో గాయపడిన ఉమ్మడి పలువురు గుంటూరు జిల్లా కార్యకర్తలకు వైద్యఖర్చుల కోసం బీమా సాయం అందించారు.


ఆస్ట్రేలియాలో జనసేన సహ సమన్వయకర్తల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలకు జనసేన పార్టీ సహ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు న్యూసౌత్‌ వేల్స్‌లో 15 మంది, విక్టోరియాలో ఏడుగురు, క్వీన్స్‌లాండ్‌లో అయిదుగురు, వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో ఆరుగురు, ఆస్ట్రేలియా క్యాపిటల్‌ టెరిటరీలో ముగ్గురు చొప్పున సహ సమన్వయకర్తలను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కె.నాగబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని