రియర్‌ వ్యూ అద్దం చూస్తూ కారు నడుపుతున్న మోదీ

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు భవిష్యత్తు వైపు చూడలేవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌ అనే కారును ముందుకు చూడకుండా, వెనకవైపు దృశ్యాలను చూపే అద్దాన్ని  (రియర్‌ వ్యూ మిర్రర్‌) చూస్తూ నడిపేందుకు యత్నిస్తున్నారని, ఆ తీరు ఒకదాని తర్వాత మరో ప్రమాదానికి దారితీస్తోందని మండిపడ్డారు.

Published : 06 Jun 2023 03:45 IST

అందుకే అది ప్రమాదాలకు గురవుతోంది
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు

న్యూయార్క్‌: భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు భవిష్యత్తు వైపు చూడలేవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌ అనే కారును ముందుకు చూడకుండా, వెనకవైపు దృశ్యాలను చూపే అద్దాన్ని  (రియర్‌ వ్యూ మిర్రర్‌) చూస్తూ నడిపేందుకు యత్నిస్తున్నారని, ఆ తీరు ఒకదాని తర్వాత మరో ప్రమాదానికి దారితీస్తోందని మండిపడ్డారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్‌ అమెరికా విభాగం ఆదివారం న్యూయార్క్‌లో ఏర్పాటుచేసిన భారీ సమావేశంలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘మన దేశంలో ఓ సమస్య ఉంది. ఆ సమస్యను మీకు చెబుతాను. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు భవిష్యత్తును చూడలేవు. వారికి ఆ సామర్థ్యం లేదు. మీరు ఏ విషయమైనా అడగండి.. వారు గతంలోకి తొంగిచూస్తారు’’ అని చెప్పారు. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని మీరు భాజపాను అడిగితే.. కాంగ్రెస్‌ హయాంలోనూ అలాంటి ప్రమాదాలు జరిగాయని చెబుతారంటూ ఒడిశా రైలు ప్రమాదంపై మండిపడ్డారు. పాఠ్యపుస్తకాల నుంచి పీరియాడిక్‌ టేబుల్‌ను ఎందుకు తొలగించారంటూ మీరు భాజపాను నిలదీస్తే.. కాంగ్రెస్‌ పార్టీ 60 సంవత్సరాల క్రితం చేసిన పనిని వారు ప్రస్తావిస్తారని వ్యాఖ్యానించారు. వారి తక్షణ ప్రతిస్పందన ఏమిటంటే గతంలోకి చూడడమేనని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం సంభవిస్తే.. అది బ్రిటిష్‌ వారి వైఫల్యం. అందుకే రైలు ప్రమాదం సంభవించిందని అప్పటి మంత్రి చెప్పలేదు. రైలు ప్రమాదానికి నాదే బాధ్యత. నేను రాజీనామా చేస్తున్నానని చెప్పారు’’ అని రాహుల్‌ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని