ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను నీరుగార్చారు: భట్టి

భారాస ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను నీరుగార్చి దళిత, గిరిజనుల ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

Published : 06 Jun 2023 03:45 IST

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: భారాస ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను నీరుగార్చి దళిత, గిరిజనుల ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లికి చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014కు ముందు కాంగ్రెస్‌ హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుంటోందని, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రారంభించనున్న కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు కూడా దళితులకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లోనే నిర్మించినవే అన్నారు. ‘‘ 2022-23లో దళితబంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని 30 నెలల్లో పూర్తి చేయిస్తానన్న సీఎం కేసీఆర్‌ పనుల్లో జాప్యంపై సమాధానం ఇవ్వాలి. జిల్లాకు వస్తున్న కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసుల భద్రత లేకుండా, నిరుద్యోగులను ముందస్తు అరెస్టులు చేయకుండా రాగలరా..? రోజుల్లో భారాసకు గుణపాఠం తప్పదు’’ అని భట్టి పేర్కొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అద్యక్షుడు డా.వంశీకృష్ణ, నేతలు రామనాథం, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‘భారాసనే ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ధరణి వద్దన్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దామని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలు.. ముఖ్యంగా రైతులు వచ్చే ఎన్నికల్లో భారాసను బంగాళాఖాతంలో కలిపి కేసీఆర్‌కు బుద్ధి చెబుతారన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తదితరులు సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణిలో లోపాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబుతోందని, ఇప్పటివరకు 22 లక్షల రైతు కుటుంబాలకు హక్కు పత్రాలు ఇవ్వలేదని కోదండరెడ్డి తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి అవకతవకలపై విచారణ చేస్తామని, భూ గ్యారంటీ చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరంజన్‌ మాట్లాడుతూ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకే కాంగ్రెస్‌పై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారన్నారు. భాజపాకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌, ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ పాల్గొన్నారు.

*  పీసీసీ లింగ్విస్టిక్‌ మైనారిటీ విభాగం ఛైర్‌పర్సన్‌గా ప్రేమలతా అగర్వాల్‌ నియమితులయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రకటన విడుదల చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు