డ్వాక్రా రుణమాఫీ హామీ ఏమైంది?

అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణమాఫీ అమలుపై తొలి సంతకం చేస్తానన్న జగన్‌రెడ్డి.

Published : 06 Jun 2023 04:34 IST

తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణమాఫీ అమలుపై తొలి సంతకం చేస్తానన్న జగన్‌రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఆసరా ద్వారా కోటి మందికి లబ్ధి చేకూరుస్తానని..లబ్ధిదారుల్ని 77 లక్షలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునిత తదితరులు ‘నాలుగేళ్ల వైకాపా పాలనలో డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయం’పై ఛార్జిషీట్‌ను సోమవారం విడుదల చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను ప్రభుత్వ సభలు, సమావేశాలకు జనాన్ని తరలించే సంఘాలుగా మార్చారు. మార్చి 25న సీఎం జగన్‌..నాలుగో విడత ఆసరా బటన్‌ నొక్కినా నేటికీ చాలా మంది లబ్ధిదారులకు నగదు జమ కాలేదు. మూడో విడత రుణమాఫీ సమయంలో ఖాళీ చెక్కులిచ్చి మోసం చేశారు. ప్రభుత్వ సభలు, సమావేశాలకు రాకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు.డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం నిధుల్ని నవరత్నాలకు మళ్లించారు’ అని సునిత మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా సంఘానికి రూ.పది లక్షల చొప్పున సున్నా వడ్డీ రుణాలిస్తానన్న జగన్‌..అధికారంలోకి వచ్చాక అసలు సున్నా వడ్డీ రుణాల్నే ఎత్తివేశారని సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని