అట్టుడికిన టంగుటూరు

అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా శ్రేణుల ఆందోళనలతో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు సోమవారం అట్టుడికింది.

Published : 06 Jun 2023 04:34 IST

తెదేపా ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి వైకాపా యత్నం
ప్రతిగా శ్రేణులతో కలిసి ‘చలో టంగుటూరు’ చేపట్టిన ఎమ్మెల్యే
స్వామిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిరిగిన చొక్కాతోనే ఎమ్మెల్యే నిరసన

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా శ్రేణుల ఆందోళనలతో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు సోమవారం అట్టుడికింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో కొండపి తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి అవకతవకలకు పాల్పడ్డారని వైకాపా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తూర్పునాయుడుపాలెంలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు ‘చెంబు యాత్ర’ పేరుతో సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతిగా వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు ఇంటిని ముట్టడించేందుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ‘చలో టంగుటూరు’కు సన్నద్ధమయ్యారు. ఉదయం 7 గంటలకే టంగుటూరు వైకాపా కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు  ప్రదర్శనగా తూర్పునాయుడుపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో టంగుటూరు ప్రధాన కూడలి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్‌బాబుతో పాటు వైకాపా శ్రేణులను పార్టీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే స్వామి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చాయి. అక్కడి నుంచి టంగుటూరుకు ప్రదర్శనగా బయలుదేరారు. మార్గమధ్యలో స్వామిని అడ్డుకునేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరం సాగిన ప్రదర్శన ఆద్యంతం పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూ.. ఎమ్మెల్యేను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే స్వామి చొక్కా కూడా చిరిగిపోయింది. చివరికి ప్రదర్శన టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని, వాహనంలోకి ఎక్కించారు. ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చివరికి ఎమ్మెల్యేను తూర్పునాయుడుపాలెంలోని ఆయన ఇంటికి తరలిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.


దళిత ఎమ్మెల్యే గొంతు నొక్కేందుకే అక్రమ అరెస్టు  

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొండపి ఎమ్మెల్యే, తెదేపా నేత డోలా బాల వీరాంజనేయస్వామి అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు ప్రతి చర్య దళిత నేత స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని సోమవారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. పోలీసులు వైకాపా క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మా పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలు, అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోంది. అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా సోదరుడు స్వామి అక్రమ అరెస్టులు, వేధింపులకు భయపడే నేత కాదు. ఎదిరించి పోరాడే నాయకుడు. తక్షణం ఆయన్ను విడుదల చేయాలి’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలవీరాంజనేయస్వామి అరెస్టుకు సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని