Nara Lokesh: మేనల్లుడూ మేనమామా ఇద్దరూ దోపిడీదారులే: నారా లోకేశ్‌

మేనల్లుడు, మేనమామలైన ముఖ్యమంత్రి జగన్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఇద్దరూ దోపిడీదారులని, ప్రజల ఆస్తుల్ని, ధనాన్ని దోచేయడంలో ఎవరికెవరూ తక్కువ కారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 06 Jun 2023 07:32 IST

సీఎం జగన్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై ఆరోపణలు
1,500 కి.మీ.కు చేరుకున్న యువగళం పాదయాత్ర

ఈనాడు, కడప: మేనల్లుడు, మేనమామలైన ముఖ్యమంత్రి జగన్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఇద్దరూ దోపిడీదారులని, ప్రజల ఆస్తుల్ని, ధనాన్ని దోచేయడంలో ఎవరికెవరూ తక్కువ కారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్ర 177వ రోజు సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సాగింది. చెన్నూరులో బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ సీఎం మేనమామ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించాల్సిందిపోయి, అహంకారం.. అవినీతి.. భూకబ్జాలతో పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. ‘సర్వరాయ ప్రాజెక్టు భారతి సిమెంటుకు, ఎమ్మెల్యే చేపల చెరువులకు మాత్రమే ఉపయోగపడుతోంది. తెదేపా అధికారంలోకి రాగానే కాలువలు తవ్వించి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరందిస్తాం. తండ్రి శవం పక్కనుండగానే సీఎం కావాలని సంతకాలు సేకరించిన జగన్‌కు మానసిక వైకల్యం ఉంది. సొంత బాబాయ్‌ని చంపేసి, తల్లిని, చెల్లిని తరిమేసి సైకోగా మారారు. డాక్టర్‌ సుధాకర్‌ నుంచి డాక్టర్‌ అచ్చెన్న వరకు దళితులను వైకాపా ప్రభుత్వం చంపేసింది. ఆ పార్టీలోని హంతకులకు జగన్‌ స్పెషల్‌ లైసెన్స్‌ ఇచ్చారు. 27 దళిత పథకాలు రద్దు చేశార’ని లోకేశ్‌ ఆరోపించారు. సభలో ప్రసంగిస్తుండగా.. మసీదు నుంచి నమాజ్‌ విని కొంత సమయం ఆపి తిరిగి కొనసాగించారు. చెన్నూరులో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.28 కోట్లతో నిర్మించిన హజ్‌హౌజ్‌ వద్ద లోకేశ్‌ సెల్ఫీ దిగారు. ‘తెదేపా అభివృద్ధికి, వైకాపా విధ్వంసానికి నిదర్శనం హజ్‌హౌస్‌. దీన్ని తెదేపా నిర్మించి ముస్లిం అవసరాలకు కేటాయిస్తే.. వైకాపా ప్రభుత్వం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేసింద’ని విమర్శించారు.


భారీగా తెదేపాలో చేరికలు

రాక్షస పాలనను అంతమొందిస్తేనే వైయస్‌ఆర్‌ జిల్లావాసులకు స్వేచ్ఛ దొరుకుతుందని, వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపే లక్ష్యంగా తితిదే కార్యకర్తలు పని చేయాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. వైకాపా నుంచి పెద్ద ఎత్తున తెదేపాలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వల్లూరు మండలం తప్పెట్ల పంచాయతీ సర్పంచి గడికోట శాంతి, భర్త సుధాకర్‌రెడ్డి దంపతులు భారీ ర్యాలీగా వచ్చి తెదేపాలో చేరారు. పది పంచాయతీలకు చెందిన పలువురు సర్పంచులు, నేతలు వైకాపాను వీడి లోకేశ్‌ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొన్నారు. సోమవారానికి పాదయాత్ర 1,500 కిమీ చేరుకోగా, అలంఖాన్‌పల్లెలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కడప నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను చక్కదిద్దుతామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని