ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దళిత ఎమ్మెల్యేకు అవినీతి అంటగడతారా?

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే దళిత సామాజికవర్గానికి చెందిన డోల బాలవీరాంజనేయస్వామికి అవినీతి అంటగట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు.

Published : 06 Jun 2023 05:11 IST

తెలుగుదేశం నాయకుల మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే దళిత సామాజికవర్గానికి చెందిన డోల బాలవీరాంజనేయస్వామికి అవినీతి అంటగట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు. స్వామి దుస్తులు చించి దాడికి పాల్పడటం, ఆయన ఇంటి ముట్టడికి అధికార పార్టీ పిలుపునివ్వడం జగన్‌ ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవినీతి, లూటీలు వైకాపా పేటెంట్‌ హక్కులు. దళిత ఎమ్మెల్యేలంటే జగన్‌రెడ్డికి ఏ మాత్రం గౌరవం లేదు. ప్రతిపక్ష నేతల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అంతకు రెట్టించి ప్రజల కోసం పనిచేస్తాం. మీ బెదిరింపులకు భయపడేది లేదు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్‌ సర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నారనే పదేపదే బాలవీరాంజనేయస్వామిని లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని.. ఇది వైకాపా సర్కారు సైకోయిజానికి పరాకాష్ఠ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నాయకులు పిలుపునిస్తే.. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించాల్సింది పోయి ముట్టడికి సహకరిస్తారా? అని పోలీసుల్ని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. ‘ప్రకాశం జిల్లా టంగుటూరులో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలో సుధాకర్‌ అనే తెదేపా నేత పాల్గొన్నారని...ఆయన భార్య హనుమాయమ్మను వైకాపా నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు. అంటే నిరసన తెలిపితే చంపేస్తారా?’ అని నిలదీశారు. బాలవీరాంజనేయస్వామిపై దాడి దళితులపై జరిగిన దాడి అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. వైకాపా నాయకుల అవినీతి, కుట్రలను ప్రశ్నించినందుకే స్వామిపై దాడికి పాల్పడ్డారని, ఓటమి భయంతోనే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయించారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌ మార్గదర్శకత్వంలోనే బాలవీరాంజనేయస్వామి, ఆయన ఇంటిపై వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని స్వామి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన వైకాపా నాయకులు ఈ నాలుగేళ్లు ఏం చేశారని తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ప్రశ్నించారు. హిట్లర్‌ పాలన కంటే జగన్‌ ప్రభుత్వం దారుణంగా ఉందని.. అవినీతిని ప్రశ్నించారని ఓ దళిత ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేస్తారా అని తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు