Vallabhaneni Vamsi: పంతం నెగ్గించుకున్న గన్నవరం ఎమ్మెల్యే!

‘ఆయనకు నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఎకరా రూ.1.5 కోట్లు. అంటే మొత్తం విలువ రూ.6 కోట్లు. గన్నవరంలో మరో ఫ్లాట్‌ ఉంది.

Updated : 06 Jun 2023 06:55 IST

తెదేపా నేత డీఫారం పట్టా రద్దు, భూమి స్వాధీనం
కోర్టుకు సెలవు రోజుల్లో ఆగమేఘాలపై చర్యలు

ఈనాడు, అమరావతి: ‘ఆయనకు నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఎకరా రూ.1.5 కోట్లు. అంటే మొత్తం విలువ రూ.6 కోట్లు. గన్నవరంలో మరో ఫ్లాట్‌ ఉంది. దాని విలువ రూ.50 లక్షలు. మరో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు. ఆయనకు డీఫారం పట్టా ఇవ్వడం సరికాదు’.. ఇదీ 1999లో ఇచ్చిన డీఫారం పట్టా రద్దు కోసం జిల్లా మెజిస్ట్రేట్‌, కృష్ణా కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలు. ఈ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయి సోమవారం సాయంత్రం గన్నవరం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆ పొలంపైకి పొక్లెయిన్‌లతో వెళ్లి, షెడ్డును కూల్చేసి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ కక్షతోనే గన్నవరం మండల తెదేపా అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరావు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా వెదురుపావులూరులో జాస్తి వెంకటేశ్వరరావుకు సర్వేనెంబరు 308/4లో 99 సెంట్ల పొలం ఉంది. ఇది డి పట్టా. దీనిని 1999లో జాస్తి రాజేశ్వరమ్మ పేరుతో వెంకటేశ్వరరావు తల్లికి ప్రభుత్వం ఇచ్చింది. వారసత్వం ప్రకారం తల్లి నుంచి ఆయనకు సంక్రమించగా.. రెవెన్యూ అధికారులే వెంకటేశ్వరరావు పేరిట మార్చారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైకాపాకు మద్దతు పలికారు. అధికారాన్ని ప్రయోగించి పలువురిని తనవైపు తిప్పుకొనేందుకు యత్నించగా, వెంకటేశ్వరావు వెళ్లలేదు. తెదేపాలోనే క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో ఈ డి-ఫారం పట్టాను తెరపైకి తెచ్చారు. ఈ స్థలం విజయవాడ బైపాస్‌ పక్కనే ఉండగా కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనిని స్వాధీనం చేసుకోవాలనే ఒత్తిడి పెరిగింది.

అంతా పక్షం రోజుల్లోనే!

మే 18న జాస్తి భూమిలోకి ఎమ్మెల్యే వంశీ మందీమార్బలంతో వెళ్లారు. ఇది ప్రభుత్వ భూమి అనీ, స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై అప్పటికే హైకోర్టు ఇన్‌జక్షన్‌ ఆర్డరు ఉంది. తర్వాత హైకోర్టు న్యాయపరంగా వెళ్లాలని ఆదేశాలిచ్చి పిటిషన్‌ను మూసివేసింది. దీంతో వెంకటేశ్వరరావుకు నోటీసు జారీచేశారు. దీనిపై ఆయన గన్నవరం తహసీల్దారుకు పట్టా, అడంగళ్‌ సమర్పించారు. తమకు డీఫారం పట్టా ఇచ్చేనాటికి అనాధీనం భూమిగానే ఉందని ఆధారాలు సమర్పించారు. తర్వాత ఆర్డీవో విచారణ చేపట్టారు. డీఫారం పట్టాపై కాకుండా వెంకటేశ్వరరావు ఆస్తులపై ఆరా తీసి వివిధ అంశాలను నివేదించారు. 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, వర్గీకరణ ప్రకారం రాజేశ్వరమ్మకు కేటాయించిన భూమి.. సురాయి చెరువు, డొంకగా ఉందని, ఇది సుప్రీం తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆక్రమించారని ప్రస్తావించిన నాలుగు ఎకరాల భూమి విలువగానీ, అది ఎక్కడ ఉందనేదిగానీ పేర్కొనలేదు. దీని స్వాధీనంపై ఎలాంటి వివరణా లేదు. ప్రస్తుతం న్యాయస్థానాలకు వేసవి సెలవులు కావడంతో ఆ అవకాశం లేకుండా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం, నాలుగో తేదీనే తహసీల్దార్‌ వాటిని జారీ చేయడం, సోమవారం స్వాధీనం చేసుకుని, పొక్లైన్‌ ప్రయోగించడం జరిగిపోయాయి.

ఇదేం తీరు?

1999లో తన తల్లికి ఇచ్చిన 99 సెంట్ల స్థలానికి.. తాను కష్టార్జితంతో సంపాదించిన భూమికి సంబంధం ఏంటని జాస్తి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘అంటే.. పేదలు పేదలుగానే ఉండాలా? పేదలు ఆస్తిపరులైతే గతంలో ఇచ్చిన భూములు, సంక్షేమ ఫలాలు తిరిగి లాక్కోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? ఈ భూమిపై ఓలుపల్లి మోహనరంగారావు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు. ఇతని తండ్రి తాతారావు. కానీ కలెక్టర్‌ ఆదేశాల్లో ఓచోట జాస్తి వెంకటేశ్వరరావు తండ్రి తాతారావుగా పేర్కొన్నారు. డీఫారం పట్టా రద్దు చేసింది వెంకటేశ్వరరావు అక్రమంగా పొందారనా? లేక నీటివనరులు, డొంక భూమి కేటాయించారనా అనేది స్పష్టత లేదు. నేను పార్టీ మారనందునే ఎమ్మెల్యే ఇలా వ్యవహరించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామ’ని జాస్తి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని