పోలవరం.. జగన్‌ పాపాల పథకంగా మారింది

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాలు దాస్తోందని.. ఇది జగన్‌ పాపాలకు వరం పథకంగా మారిపోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు.

Published : 06 Jun 2023 05:11 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాలు దాస్తోందని.. ఇది జగన్‌ పాపాలకు వరం పథకంగా మారిపోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే పోలవరం ప్రాజెక్టును కేవలం బ్యారేజీ స్థాయికి తీసుకొచ్చే కుట్రకు వైకాపా రచన చేసిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే కేంద్రం వద్ద ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ.. చేసుకున్న ఒప్పందంపై సంతకం చేసి వచ్చారని ధ్వజమెత్తారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం చేపట్టేబోయే సమీక్షా సమావేశం పారదర్శకంగా మీడియా సమక్షంలో జరగాలన్నారు. సోమవారం రాత్రి గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సరిగ్గా రెండు నెలల క్రితం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసిన తరువాత పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఆడిన నాటకం బయటపడింది. దాన్ని ప్రజల ముందు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్టు కోసం విడుదల చేసిన రూ.17,144 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు ఒప్పుకుంటేనే విడుదల చేసింది. మీరు అంగీకారం తెలపకపోతే దానిపై బహిరంగంగా చర్చకు రావాలి. నాలుగు రోజుల క్రితం స్పిల్‌వే వద్ద కీలకమైన గైడ్‌ బండ్‌ కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిన నిర్మాణం వద్దకు మంత్రి అంబటి రాంబాబు రహస్యంగా వెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే కూలిపోవడం అంటే.. పెద్దలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏం చేయబోతోందన్న దానిపై సమాధానం చెప్పాలి’ అని మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

అన్నవరంలో ఈ నెల 14న సత్యదేవునికి పూజల అనంతరం పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర ప్రారంభమవుతుందని మనోహర్‌ తెలిపారు. గుంటూరులోని జిల్లా జనసేన కార్యాలయంలో వారాహి యాత్ర గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు