CM KCR: వెలుగుల్లో తెలంగాణ.. చిమ్మచీకట్లో ఆంధ్రా

‘తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారుచీకటి అవుతుంది.. మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ధగధగ మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మ చీకటి అలుముకుంది’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 07 Jun 2023 16:09 IST

ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు ఇచ్చే దిక్కులేదు
కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులు, పైరవీకారులదే భోజ్యం
ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దు
నాగర్‌కర్నూల్‌ సభలో ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

‘కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులు, పైరవీకారులదే భోజ్యం. మళ్లీ మనల్ని మింగేయడానికి మాయమాటలు చెబుతున్నారు. మేం లంచాల పీడ లేకుండా చేస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, భారాస ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పైరవీకారులుండేవారు. డబ్బులిస్తేనే పనులు జరిగేవి. ధరణి ద్వారా రైతుకే అధికారం ఇచ్చాం. మీ వేలిముద్ర తప్ప మీ రికార్డును ఇక ఎవరూ మార్చలేరు. నీ చేతికి ఇచ్చిన అధికారాన్ని నువ్వు కాపాడుకుంటావా? వదులుకుంటావా? ఆలోచించుకోవాలి.

కేసీఆర్‌


ఈనాడు- మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే- నాగర్‌కర్నూల్‌: ‘తెలంగాణ వస్తే ఈ ప్రాంతం కారుచీకటి అవుతుంది.. మీకు కరెంటు రాదని శాపాలు పెట్టారు. తెలంగాణ నేడు 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ధగధగ మెరిసిపోతోంది. అదే ఆంధ్రాలో చిమ్మ చీకటి అలుముకుంది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటలూ విద్యుత్తు ఇచ్చే దిక్కులేదు. రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే వ్యవస్థ కూడా ఎక్కడా లేనేలేదు. తెలంగాణలో ఇంతటి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టుకోవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, భారాస జిల్లా కార్యాలయాలను సీఎం మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. ధరణిలో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, ఒకరో ఇద్దరో మిగిలి ఉంటే వాళ్ల సమస్యలూ పరిష్కారమవుతాయన్నారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, వారు వలస పోకుండా చూడాలి. సాగుకు సరిపడా కరెంటు ఇవ్వాలి. ఇదే మా లక్ష్యం’ అని వివరించారు.

నియోజకవర్గానికి నాలుగువేల ఇళ్లు

‘గిరిజనులకు పోడు భూములు పంచుకుంటున్నాం. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం పెట్టాం. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు. ఆ ప్రకారం ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు 4వేల చొప్పున ఇళ్లు ఇస్తాం. కులవృత్తులు చేసుకునే బీసీలను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.లక్ష ఇచ్చే పథకం ఈ నెల 9న ప్రారంభమవుతుంది. ఇలా మానవీయ కోణంలో పరిపాలన కొనసాగిస్తున్నాం. కులం లేదు. మతం లేదు. ప్రజలందరూ తెలంగాణ బిడ్డలు. అందరూ మంచిగా బతకాలి. కంటి వెలుగు పథకం ద్వారా కోట్ల మందికి పరీక్షలు చేయించాం. లక్షల మందికి కళ్లద్దాలు ఇస్తున్నాం. ఇది రైతులు, పేదలు, దళితులు, గిరిజనుల ప్రభుత్వం. పాలమూరు జిల్లా కన్నీటిని తుడిచి ఈ ప్రాంతాన్ని పంటల భూమిగా మార్చడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం. ఆ సంతోషం గుండెల నిండా ఉంది. మీ ముందు ఒకటే శపథం చేస్తున్నా. ఏ పని తలపెట్టినా భగవంతుడు నన్ను ఓడించలేదు. గెలిపించాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. నార్లపూర్‌, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌ జలాశయాల ద్వారా 75-80 టీఎంసీల నీటిని నింపుకొంటాం. ఇవి ఒక్కసారి నిండితే పాలమూరు బంగారు తునక అవుతుంది. ఆగస్టులో ఈ జలశయాలను నీళ్లతో నింపబోతున్నాం. పాలమూరు జిల్లాలో ఎక్కడా నీటి ఇబ్బంది మాటే లేకుండా చూస్తాం.

మీరే నా బలగం.. బంధువులు

మీరే నా బలగం, బంధువులు. మీ ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ధరణి పోర్టల్‌ ఉండాలి. ప్రస్తుతం రైతు భూమిని మార్చాలంటే వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్‌ కూడా మార్చలేరు. గతంలో రికార్డు అసిస్టెంటు, రెవెన్యూశాఖ రాసిందే రాత. ఇప్పుడు భూమిని మార్చే అధికారం కేవలం రైతుకే ఇచ్చాం. పైరవీకారులు, లంచగొండులు, ఎవరైతే రైతుల రక్తం తాగారో వాళ్లే ధరణిని రద్దు చేయాలంటున్నారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పండి. నిమిషాల్లో పరిష్కారం చేస్తారు. కాంగ్రెస్‌ పాలనలో ఆపద్బంధు అని ఉండేది. రైతు చనిపోతే కేవలం రూ.50 వేలు ఇస్తామని చెప్పేవారు. బాధితులు చెప్పులరిగేలా తిరిగితే రూ.10 వేలో.. రూ.20 వేలో చేతిలో పెట్టి పంపించేవారు. ఏనాడూ పూర్తిసొమ్ము రాలేదు.

అరిగోస నుంచి అభివృద్ధి వైపు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తాగునీరు, సాగునీరు, కరెంటు కోసం అరిగోస పెట్టింది. నేను పాలమూరు ఎంపీగా ఉంటే వారి సమస్యలు తెలుస్తాయని ప్రొ.జయశంకర్‌ అన్నారు. ఆ రోజుల్లో ఉద్యమం బలంగా లేకపోయినా.. పాలమూరు ప్రజలు ఎంతో ప్రేమతో నన్ను గెలిపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అనేక సంక్షేమ పథకాల్లో ఎవరి ఊహకు అందని విధంగా ఏటా రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను అమలు చేస్తున్నాం. దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. భారాస వచ్చిన తర్వాత పాలమూరు పచ్చబడింది. గత ప్రభుత్వాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఇక్కడ సభలు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్కరైనా పాలమూరుకు వైద్య కళాశాలను తీసుకొచ్చారా? పాలమూరు పేరు చెప్పి బిల్‌క్లింటన్‌, ప్రపంచ బ్యాంకులను తీసుకొచ్చారు. ఇక్కడి ప్రజల పరిస్థితి మాత్రం మారలేదు. నాడు వలస పోయిన పాలమూరు జిల్లాకు నేడు ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ నుంచి కూలీలు నాట్లు వేయడానికి వస్తున్నారు. ఇది నిజంగా గర్వకారణం. ఒకప్పుడు ఎకరం రూ.10 వేలు పలికిన భూములు నేడు రూ.50 లక్షలు, రహదారి పక్కనుంటే రూ.రెండు, మూడు కోట్లు పలుకుతున్నాయి. ప్రజలు పల్లెల్లో రూ.లక్షలు పెట్టి ఘనంగా బొడ్రాయి పండగ చేసుకుంటున్నారు’ అని సీఎం అన్నారు. ‘వలసలతో వలవలపించు కరవు జిల్లా.. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీరు జలకం ఆడి పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకొంది’ అనే పాట తానే రాశానని కేసీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఉద్యోగులకు సెల్యూట్‌ చేస్తున్నా..

అంతకుముందు సీఎం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందడానికి కారణం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు. ఉద్యోగులకు సెల్యూట్‌ చేస్తున్నా’ అన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.1,649 కోట్లతో కలెక్టరేట్లను నిర్మించుకున్నట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌తో కలిపి మొత్తం 19 కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.దామోదర్‌రెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ ఇషాక్‌, మాజీ ఎంపీ జగన్నాథం, పలువురు జడ్పీ ఛైర్‌పర్సన్లు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని