‘చేయి’పట్టి నడుస్తారా?..జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌ వైపే మొగ్గు!

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది.

Updated : 07 Jun 2023 06:37 IST

రాహుల్‌ విదేశీ పర్యటన  నుంచి వచ్చాక ఖరారు
కొనసాగుతున్న భాజపా యత్నం

ఈనాడు హైదరాబాద్‌: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చేరికలుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇటీవలే వీరిద్దరినీ కలిసి చర్చించినట్లు సమాచారం. మరోవైపు భాజపా కూడా ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ రెండురోజుల క్రితం ఈ అంశంపై చేరికల కమిటీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఈటల రాజేందర్‌తో చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. భారాస నుంచి పొంగులేటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బయటకు వచ్చారు. అలాగే మాజీ మంత్రి, కొల్లాపూర్‌ నుంచి 2018 ఎన్నికలకు ముందు వరుసగా గెలుపొందిన జూపల్లితో పాటు ఆయన అనుచరులు కూడా భారాసకు గుడ్‌బై చెప్పారు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వంపైన, భారాసపైన విమర్శలు గుప్పించారు. కొల్లాపూర్‌లోనూ సమావేశం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరడానికి నిర్ణయించుకోగా, వీరితో సన్నిహిత సంబంధాలున్న ఈటల రాజేందర్‌ భాజపాలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

కానీ ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, అక్కడ భారాసకు కాంగ్రెస్‌ ప్రధాన పోటీదారుగా ఉండడడం, భాజపా ప్రభావం తక్కువగా ఉండటం తదితర కారణాలతో కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలూ దీనికి దోహదపడ్డాయి. పొంగులేటి, జూపల్లి... కొత్తపార్టీ ఆలోచన కూడా చేశారు. వీటన్నిటిపైనా పలు దఫాలుగా చర్చించుకున్న తర్వాత అటు ఉమ్మడి ఖమ్మం, ఇటు కొల్లాపూర్‌లోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నాయకత్వం కూడా వీరిని చేర్చుకోవడానికి, తగిన ప్రాధాన్యమివ్వడానికి మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సునీల్‌ కనుగోలుతో జరిగిన చర్చల్లో నియోజకవర్గాలు, అభ్యర్థులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గెలవడానికి అవకాశ మున్న అభ్యర్థులనే పోటీకి నిలపాలనే అంశంపైనా వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో నేరుగా కలిసి మాట్లాడిన తర్వాత వారు పార్టీలో చేరే తేదీ ఖరారు కానుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌, అటు నుంచే యూరప్‌ వెళ్లి ఈ నెల 21న తిరిగి రానున్నట్లు తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యి అన్ని అంశాలను చర్చించిన తర్వాత చేరిక తేదీని ఖరారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈలోగా ఏవైనా మార్పులు జరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే భాజపాలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పొంగులేటి, జూపల్లితో సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశం తర్వాతే సునీల్‌ బన్సల్‌ ఈటలకు సూచనలిచ్చినట్లు తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని