కేసు వద్దు.. శవపరీక్షా వద్దు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలోదారుణ హత్యకు గురైన తెదేపా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుధాకర్‌ భార్య, అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Published : 07 Jun 2023 03:37 IST

న్యాయం జరగదంటూ తెదేపా శ్రేణుల ఆందోళన
హనుమాయమ్మ హత్యోదంతంలో ఉద్రిక్త పరిస్థితులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలోదారుణ హత్యకు గురైన తెదేపా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుధాకర్‌ భార్య, అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెదేపా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఒంగోలు జీజీహెచ్‌ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. హత్య చేశాక నిందితుడు గ్రామంలోనే ఉన్నా.. అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. ఈ డిమాండ్లతో కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే జీజీహెచ్‌ పరిసరాల్లో మోహరించి ఉన్న పోలీసులు వైద్యశాలలోకి వెళ్లే ప్రధాన ద్వారాలను మూసేసి తెదేపా కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అధికారులనే వైద్యశాల వద్దకు రప్పిస్తామని పోలీసులు సర్దిచెప్పినా ఆందోళనకారులు అంగీకరించలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్డీవో విశ్వేశ్వరరావు, అధికారులు అక్కడికి చేరుకోగా.. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీనివ్వాలని తెదేపా నేతలు ఆనందబాబు, స్వామి డిమాండు చేశారు. కలెక్టర్‌ వద్దే విషయం తేల్చుకుంటామని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినదించారు. న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని, కేసు ఉపసంహరించుకుంటామని, పోస్టుమార్టం చేయొద్దని అన్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు సముదాయిస్తూ పోస్టుమార్టం చేసి అప్పగిస్తామనడంతో శాంతించారు. ఎట్టకేలకు రాత్రి ఎనిమిదింటికి శవపరీక్ష పూర్తి చేశారు.

వ్యూహాత్మకంగానే జాప్యం

మరుగుదొడ్ల నిర్మాణంలో తెదేపాకు చెందిన ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి రూ.కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్‌ అశోక్‌బాబు ఆధ్వర్యంలో చెంబు మార్చ్‌ పేరిట ఆందోళనకు సిద్ధమయ్యారు. దీన్ని ప్రతిఘటిస్తూ తెదేపా ‘చలో టంగుటూరు’ చేపట్టింది. అధికార, విపక్షాలు పోటాపోటీ ఆందోళనలకు పిలుపునిచ్చినా నిలువరించటంలో పోలీసులు విఫలమయ్యారు. దరిమిలా టంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఈ తీవ్రత కొనసాగుతుండగానే హనుమాయమ్మ హత్యకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నంనుంచి ఆమె మృతదేహం ఒంగోలు జీజీహెచ్‌ శవాగారంలోనే ఉన్నప్పటికీ అధికారులు వ్యూహాత్మకంగానే పరీక్ష జాప్యం చేశారన్న విమర్శలున్నాయి.

ఎమ్మెల్యే స్వామిపై రెండు కేసులు

కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై టంగుటూరు పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేసినట్లు ఓ కేసు... నియమావళిని ఉల్లంఘించి జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారన్న విషయమై మరో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని