Yuvagalam: జగన్‌ను ఇక నమ్మం.. మీతోనే మా గమ్యం

‘ముఖ్యమంత్రి జగన్‌ను ఇక నమ్మబోం.. ఆయన పాలనలో రెడ్డి సామాజికవర్గమంతా తీవ్ర కష్టనష్టాల పాలైంది. ఇక మా గమ్యం మీవెంటే.. మీరు భరోసా ఇవ్వండి. రాయలసీమరెడ్లు అందరం మీవెంట నడుస్తాం’ అంటూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ముక్తకంఠంతో మద్దతు పలికారు.

Updated : 07 Jun 2023 07:06 IST

రెడ్డి సామాజికవర్గ ప్రతినిధుల వెల్లడి
తమ వర్గమంతా నష్టాలపాలైందని ఆవేదన  
రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారన్న లోకేశ్‌
కడప రహదారుల్లో కిటకిటలాడిన జనం

ఈనాడు, కడప: ‘ముఖ్యమంత్రి జగన్‌ను ఇక నమ్మబోం.. ఆయన పాలనలో రెడ్డి సామాజికవర్గమంతా తీవ్ర కష్టనష్టాల పాలైంది. ఇక మా గమ్యం మీవెంటే.. మీరు భరోసా ఇవ్వండి. రాయలసీమరెడ్లు అందరం మీవెంట నడుస్తాం’ అంటూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ముక్తకంఠంతో మద్దతు పలికారు. ‘ఎన్టీఆర్‌ హయాంలో మేమంతా తెదేపాలో ఉన్నాం. రాయలసీమ జిల్లాలు.. ప్రత్యేకించి కడప తెదేపాకు కంచుకోటగా ఉండగా, గోబెల్స్‌ ప్రచారంతో మమ్మల్ని తమవైపు తిప్పుకొని వాడుకుని వదిలేశారు’ అని వివరించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం కడప నగరంలో రెడ్డి సామాజికవర్గ ప్రతినిధులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. భారీ ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గం నుంచి తరలి వచ్చారు. వైకాపా పాలనలో రెడ్లు బాగుపడ్డారనే ప్రచారం తప్ప ఏమీ ఒరిగిందిలేదన్నారు. జగన్‌ చేతిలో రెడ్లే తీవ్రంగా నష్టపోయారని.. వైకాపా పాలనలో హత్యలకు, దాడులకు, నష్టాలకు గురయ్యారని వివరించారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగాల్లేక జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. తమ సామాజికవర్గంలో గుత్తేదారులు కొందరు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపాపై విశ్వాసం ఉందని.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

ఆ నలుగురు రెడ్లే బాగుపడ్డారు

వైకాపా ప్రభుత్వంలో నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. వీరిలో జగన్‌మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారని.. వీరు తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. పాదయాత్ర ప్రారంభంలో రెడ్డి సామాజికవర్గం తప్ప ఇతరులంతా బాధితులేనని భావించానని.. రాయలసీమ పర్యటనలో అందరికంటే రెడ్డి వర్గీయుల నుంచే కష్టాలు ఎక్కువగా విన్నానని వివరించారు. జగన్‌ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సామాజికవర్గం మోసపోయిందన్నారు. అమరావతిలో రెడ్డి భవన్‌, వసతి సముదాయం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అయిదుగురికి మంత్రి పదవులు ఇచ్చామన్నారు.

బెయిల్‌ తీసుకోను.. జైలుకెళ్తా

వైకాపా పాలనలో తమపై తప్పుడు కేసులు బనాయించారంటూ పలువురు ప్రస్తావించగా.. లోకేశ్‌ స్పందిస్తూ ‘నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు సైతం పెట్టారు. ప్రొద్దుటూరులో మరో కేసు పెడతామన్నారు. పెట్టుకోండి.. బెయిల్‌ మాత్రం తీసుకోను.. కడప జైల్లో కూర్చుంటానని సీఐకి తెలిపా’ అని చెప్పారు. తెదేపా అధికారంలోకి రాగానే రెడ్లపై ఉన్న కేసులను ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారు. నాకు కులం, మతం, ప్రాంతం లేవు. నా పీఆర్వో చైతన్యరెడ్డి అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కలిసి వస్తారో వారంతా తనవాళ్లేనన్నారు. ‘మంత్రాలయంలో జనం నన్ను లోకేశ్‌రెడ్డి అని పిలిచారు. నాపట్ల మీకు ఎలాంటి అనుమానం వద్దు.. పూర్తిగా నమ్మండి’ అని వివరించారు.

కడపలో లోకేశ్‌కు బ్రహ్మరథం

కడప గడ్డపై లోకేశ్‌కు జనం నీరాజనం పలికారు. మంగళవారంనాటి పాదయాత్రలో రహదారులు జనంతో కిక్కిరిపోయాయి. రహదారులకు ఇరువైపులా నిలబడి.. భవనాల పైకెక్కి లోకేశ్‌కు అభివాదం చేస్తూ కనిపించారు. వేలమంది ఆయన వెంట నడిచారు. కొన్నిచోట్ల ముందుకు సాగలేనంతగా చుట్టుముట్టారు. వివిధ రంగాల ప్రతినిధులు లోకేశ్‌కు సమస్యలు విన్నవించారు.


లోకేశ్‌ రెడ్డనిపించుకో!
- నాగభూషణ్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గం

‘మా రెడ్లకు భరోసా ఇవ్వండి. మేమంతా మీకు అండగా ఉంటాం. జగన్‌ అధికారంలోకి రాగానే మా ఇంటిపై దాడి చేసి రూ. 20 లక్షల ఆస్తిని ధ్వంసం చేయించారు. వెంటనే చంద్రబాబు ఫోన్‌ చేసి నాకు భరోసా ఇచ్చారు. మీపై మాకు ఎంతో విశ్వాసం ఉంది. లోకేశ్‌రెడ్డి అనిపించుకో.. మేమంతా నీవెంట ఉంటాం.’


మా తమ్ముణ్ని పొట్టనబెట్టుకున్నారు
- రామచంద్రారెడ్డి, పులివెందుల నియోజకవర్గం

‘జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 12 రోజులకే మా తమ్ముణ్ని పొట్టనబెట్టుకున్నారు. రాజకీయంగా హత్య చేయించి వ్యక్తిగత కక్షగా చిత్రీకరించారు. జగన్‌కు రెడ్లూ బాధితులే. ఇప్పుడు మా తమ్ముడి పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. ఇలాంటి ఘటనలు నాలుగేళ్లుగా ఎన్నో జరిగాయి.’


‘మిషన్‌ రాయలసీమ’పై తెదేపా ప్రణాళిక
నేడు ప్రముఖులతో లోకేశ్‌ ముఖాముఖి

రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన తెదేపా బుధవారం కీలక ప్రకటన చేయనుంది. కడపలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీమలోని వివిధ జిల్లాల ప్రముఖులు, పార్టీ నేతలతో లోకేశ్‌ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గత 119 రోజులుగా పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలు.. పరిష్కారానికి రూపొందించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరిస్తారు. సీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ‘మిషన్‌ రాయలసీమ’ పేరిట చేసే ప్రకటనలో రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి చేపట్టే కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. యువత ఉపాధికి పరిశ్రమలు, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి తాగునీటి సదుపాయం, వలసల నివారణ ప్రణాళికను విడుదల చేయనున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాలు.. భవిష్యత్తు ఫలితాలను విశదీకరించనున్నారు. ఇందుకోసమే బుధవారం లోకేశ్‌ పాదయాత్రకు విరామమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని