ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి తీరుతాం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత తెలుగు జాతికి బలమైన పార్టీగా తెదేపా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Published : 07 Jun 2023 05:32 IST

తెలంగాణలో కూడా పూర్వవైభవం సాధిస్తాం: చంద్రబాబు
ఎన్టీఆర్‌ భవన్‌లో బాబును సన్మానించిన తెలంగాణ తెదేపా నాయకులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత తెలుగు జాతికి బలమైన పార్టీగా తెదేపా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వందకు వెయ్యి శాతం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. తెలంగాణలో తెదేపా కళకళలాడుతోందని.. ఏదో ఒక రోజు ఇక్కడ కూడా పూర్వవైభవం సాధిస్తుందని, ఇందులో అనుమానం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. తెదేపా అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు ఘనస్వాగతం పలికారు.  తెలంగాణ తెదేపా రాష్ట్రశాఖ చంద్రబాబుని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇక్కడి ముఖ్యమంత్రి విధ్వంసం చేయలేదు. తెదేపా నాడు ప్రారంభించిన అభివృద్ధిని ఆపలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.

ప్రజల్లో ఉండండి....

మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో తన బాధ్యత మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. ‘పార్టీ అధ్యక్షునిగా సహకారం అందిస్తా. తెలంగాణలో నిలదొక్కుకోండి. నిరంతరం ప్రజల్లో ఉండండి..’ అంటూ రాష్ట్ర నేతలకు ఉద్బోధించారు. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ- చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తెలుగుప్రజల కోసమే దిల్లీకి వెళ్లి అమిత్‌షాను కలిశారని..రాజకీయాల కోసం, కేసుల మాఫీ కోసం  కాదని చెప్పారు. మహానాడు కోసం ఇటీవల తాను ఏపీకి వెళ్లినప్పుడు- ఎంత తొందరగా ఎన్నికలు వస్తే చంద్రబాబు అంత త్వరగా సీఎం అవుతారని అక్కడి ప్రజలు చెప్పారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెదేపా కీలకపాత్ర పోషిస్తుందని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి పనిచేద్దామని అరవింద్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అందరం కలిసి పనిచేద్దామని బక్కని నర్సింహులు అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు