పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం

రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్సెల్బీసీ సొరంగ మార్గానికి చేరుకుంది.

Published : 07 Jun 2023 05:32 IST

 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్సెల్బీసీ సొరంగ మార్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిద్ధాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన కూడలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారాస నేతల ఆదేశాలు, అనుమతులతో అక్రమ కేసులు పెట్టడం, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికే పోలీసుశాఖ పరిమితమవుతోందన్నారు. ఇది వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను నిషేధిత సంస్థలకు చెందిన వారిగా ముందస్తు అరెస్టులు చేసి భారాస నేతలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. అసైన్డ్‌ భూముల్లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు నిర్మించి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, గుణపాఠం తప్పదన్నారు. మార్లపాడుతండాకు చెందిన రెడ్యానాయక్‌ కుటుంబసభ్యులు 105 ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేస్తే ధరణిలో పాత వారి పేరే నమోదు చేశారని బాధితులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. ధరణితో అక్రమాలు పెరిగిపోయాయని,  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు రైతులకు పట్టాలను అందజేసి రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని, జీవో నం.317 రద్దు చేస్తామని భరోసానిచ్చారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, సర్పంచి నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని