మానసిక వైకల్యం ఎవరికో పరీక్షలు చేయించాలి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లలో మానసిక వైకల్యం ఎవరికి ఉందో తేల్చేందుకు ఇద్దరూ పరీక్షలకు సిద్ధం కావాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 07 Jun 2023 04:24 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లలో మానసిక వైకల్యం ఎవరికి ఉందో తేల్చేందుకు ఇద్దరూ పరీక్షలకు సిద్ధం కావాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోకేశ్‌కు పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే మానసిక వైకల్యం ఉందని, ఆయన లండన్‌ మందులూ వాడుతున్నారని లోకేశ్‌ బహిరంగంగా సవాలు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గం కమలాపురంలో లోకేశ్‌ తొడ కొట్టి సవాల్‌ చేశారంటే ప్రజలు అపోహ పడే ప్రమాదం ఉన్నందున సీఎం పరీక్షలకు సిద్ధం కావాలి. కుంగిపోయిన పోలవరం ప్రాజెక్టు బండ్‌ పరిశీలనకు ముఖ్యమంత్రి వెయ్యి మంది పోలీసుల పహారాలో వెళ్లడం విడ్డూరంగా ఉంది. పోలవరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి, పాత గుత్తేదారును తిట్టి పబ్బం గడుపుకోవడం మానుకోవాలి’ అని హితవు పలికారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల చంద్రబాబును ప్రశంసించగా తమ పార్టీకి చెందిన కొందరు ఆయన్ను విమర్శించారని.. ఈ నేపథ్యంలో తాను రజనీకాంత్‌ను కలిసి క్షమాపణలు చెప్పినట్లు రఘురామ తెలిపారు. ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణపై ఛార్జి మెమో జారీ చేసి దాన్ని క్రిమినల్‌ కేసుగా మార్చడం దారుణమన్నారు. సూర్యనారాయణ పారిపోయినట్లు పేర్కొని వృద్ధురాలైన ఆయన తల్లిని వేధించడం సిగ్గుచేటన్నారు. కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అనుచరుడి భార్య, దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం తమ ప్రభుత్వ దాష్టీకానికి పరాకాష్ఠగా విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని