Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
అగ్రనాయకత్వం సయోధ్య కుదిరిందని చెబుతున్నా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య రోజు రోజుకీ దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.
11న ఆయన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి
ఆ రోజు కీలక ప్రకటన చేస్తారంటూ జోరుగా ఊహాగానాలు
ఆ ప్రచారాలను తోసిపుచ్చిన హస్తం పార్టీ వర్గాలు
రాజస్థాన్ కాంగ్రెస్‌లో గరంగరం రాజకీయాలు
దిల్లీ: అగ్రనాయకత్వం సయోధ్య కుదిరిందని చెబుతున్నా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య రోజు రోజుకీ దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. అధిష్ఠానం ముందుంచిన డిమాండ్ల విషయంలో పైలట్ వెనకడుగు వేయబోరని ఆయన సన్నిహితులు నొక్కి చెబుతున్న పరిస్థితుల్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలట్ తదుపరి వ్యూహం ఏమిటనే అంశమే కేంద్రంగా ఇవి జోరందుకున్నాయి. అధిష్ఠానం స్పందన కోసం తమ నేత వేచి చూస్తున్నారని ఆయన అనుయాయులు కొందరు చెబుతున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సచిన్ పైలట్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకే అధిక అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. అందుకు ఈ నెల 11న నిర్వహించనున్న సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి కార్యక్రమం వేదిక కావచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
ఆ డిమాండ్లే కీలకం
మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు, ఉద్యోగ నియామక పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులను శిక్షించటం సచిన్ డిమాండ్లలో ప్రధానమైనవి. గత వారం దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సుదీర్ఘ మంతనాల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఐక్యంగా పనిచేస్తామని రాష్ట్ర నేతలిద్దరూ అధిష్ఠానానికి మాట ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, సచిన్ డిమాండ్ల విషయం ఏమైందో తెలియరాలేదు. ‘ఇప్పుడు బంతి అధిష్ఠానం కోర్టులోనే ఉంద’ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి గహ్లోత్ మాత్రం పైలట్ ప్రస్తావించిన అంశాలపై చర్యలు ప్రారంభించిన దాఖలాలు కనిపించడంలేదు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పాటు పశ్నాపత్రాలు లీకైన ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేయాలని కూడా పైలట్ డిమాండ్ చేస్తున్నారు.
వర్ధంతి సభ సన్నాహాలు
సచిన్ పైలట్ తండ్రి, రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఒకప్పటి అగ్రనేత రాజేశ్ పైలట్ వర్ధంతి నిర్వహణకు దౌసాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి మురారీ లాల్ మీనా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన సచిన్ పైలట్‌కు అత్యంత సన్నిహితుడు. సచిన్ పైలట్ కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారనే ప్రచారాన్ని మురారీ లాల్ దృష్టికి తీసుకెళ్లగా..‘ఈ ఊహాగానం ఎలా బయలుదేరిందో తెలియడం లేదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరాధార ప్రచారమని కొట్టిపారేశారు. పార్టీ ఆదేశాల మేరకు రాజేశ్ పైలట్ వర్ధంతికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఎప్పటిలా కొనసాగడం, తన డిమాండ్లపై పైలట్ వెనక్కితగ్గే సూచనలు కనిపించకపోవడంతో...రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయోనన్నది ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?