మోసపోయి గోస పడొద్దు

‘ములుగులాంటి వెనుకబడిన జిల్లాకు వైద్య కళాశాల వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కనీసం దరఖాస్తు చేయకున్నా కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల తెచ్చారు.

Updated : 08 Jun 2023 06:26 IST

కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు
రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై కొందరికి కడుపు మంట: కేటీఆర్‌

ఈనాడు, వరంగల్‌, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: ‘ములుగులాంటి వెనుకబడిన జిల్లాకు వైద్య కళాశాల వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కనీసం దరఖాస్తు చేయకున్నా కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల తెచ్చారు. దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే ఓర్వలేక ఏం సాధించారని కాంగ్రెస్‌ వాళ్లు అడ్డం నిలువు మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోయి... గోస పడొద్దు’ అని ప్రజలకు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. బుధవారం ములుగు కలెక్టరేట్, ఎసీˆ్ప కార్యాలయాలకు శంకుస్థాపనతోపాటు రూ.133 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, డీజీపీ అంజనీకుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

వివిధ సంక్షేమ పథకాలకు చెందిన రూ.200 కోట్ల ఆస్తులు, యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సభలో మాట్లాడారు. ‘‘సమైక్య రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌... ఆనాడు తెలంగాణకు తాగునీళ్లివ్వక ఇబ్బంది పెట్టలేదా? సాగునీరివ్వక సతాయించలేదా? మన పొరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటోంది. మిగతాది మార్కెట్‌లో మిల్లర్లు ఎంతచెబితే అంతకే రైతులు అమ్ముకుంటారు. అలాంటి కాంగ్రెసోళ్లు ఇక్కడికొచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ పంట పెట్టుబడికి ఎకరానికి రూ.2 వేలు ఇస్తే, ఇక్కడ కేసీఆర్‌ ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 3,146 తండాలు, గూడేలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మారుమూల ములుగు... జిల్లా కేంద్రమైంది. మున్సిపాలిటీగా మారింది. స్థానిక ఎమ్మెల్యే... కాంగ్రెస్‌ పార్టీ అయినా ప్రజలంతా మనవారని కేసీˆఆర్‌ నలుగురు మంత్రులను ఇక్కడికి పంపించారు. ములుగు నియోజకవర్గంలో 17 వేల ఎకరాలకు గిరిజన మంత్రి సత్యవతి చేతుల మీదుగా పోడు పట్టాలను అందజేయనున్నాం. ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు, భాజపా వాళ్లు... కొత్త వేషాలతో వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వారి మాటలకు ఆగం కావొద్దు’’అని కేటీఆర్‌ సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ములుగు జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్‌, వరంగల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, రెడ్కో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

రామప్ప శిల్పాల ఫొటోలన్నీ పంపండి

వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని మంత్రి కేటీఆర్‌ తొలిసారి సందర్శించారు. శిల్పాల సౌందర్యాన్ని, నిర్మాణ శైలిని చూసి అబ్బురపడ్డారు. గర్భాలయంలో రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు, గైడ్‌ విజయ్‌ ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. ఆలయం నీళ్లలో తేలియాడే ఇటుకలు, నల్లరాతి శిలలు, శాండ్‌బాక్స్‌ పరిజ్ఞానంతో నిర్మించిందని వివరిస్తుండగా... శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ అంటే ఏమిటని వాకబు చేశారు. ఆలయంలోని శిల్పాల ఫొటోలు తనకు పంపించాలని కోరారు. అక్కడి నుంచి మంత్రులు రామప్ప చెరువు వద్దకు చేరుకుని, గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేసి, దీపం వదిలారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు