ఎస్సెల్బీసీని నిర్లక్ష్యం చేసిన కేసీఆర్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4లక్షల ఎకరాలకు సాగునీరు, 500 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపవడానికి భారాస ప్రభుత్వమే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

Published : 08 Jun 2023 05:45 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అచ్చంపేట, అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4లక్షల ఎకరాలకు సాగునీరు, 500 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపవడానికి భారాస ప్రభుత్వమే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జలయజ్ఞంలో భాగంగా 2008లో ఈ పనులను అప్పటి సీఎం వైఎస్‌ ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి చేయకుండా కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్సెల్బీసీ సొరంగంలోకి వెళ్లి పనుల వివరాలపై అక్కడి అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టును రూ.2,259 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంచనా వ్యయం రూ.4,776 కోట్లకు పెరిగింది. భారాస అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేది. దోమలపెంట వైపు తవ్వకం పనులు నాలుగేళ్లుగా టీబీఎం పనిచేయక నిలిచిపోయాయి. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వైపు 3నెలల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. రెండు వైపులా సొరంగం తవ్వేందుకు రెండు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్లను (టీబీఎంలను) కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగా భారాస అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుపై శీతకన్ను వేసింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏడాది కాలంలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ నత్తనడకన సాగుతుండటం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం’’ అని ఆరోపించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు డా.మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు