నింగిలో చుక్కలు కాదు.. నీటి చుక్కలూ ఇవ్వలేరా?

చంద్రుడిని, నక్షత్రాలను వదిలేయండి.. మాకు నీళ్లు, కరెంటు ఇవ్వండి) అని 75 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులను అడుగుతున్నా ఇవ్వలేకపోతున్నారు’’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు

Updated : 08 Jun 2023 06:23 IST

కేంద్ర పాలకులను నిలదీసేందుకు ప్రతి పౌరుడూ జాగృతం కావాలి
భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి భారాసలోకి చేరికలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మనమేమన్నా వాళ్లను చంద్రుడిని, చుక్కలను తెచ్చి ఇమ్మంటున్నమా? మన జీవితానికి అత్యవసరమైన, ప్రకృతిలో అందుబాటులో ఉన్న తాగునీటిని, సాగు నీటిని, విద్యుత్‌ను మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. చాంద్‌ సితారో చోడో.. పానీ బిజిలీ జోడో (చంద్రుడిని, నక్షత్రాలను వదిలేయండి.. మాకు నీళ్లు, కరెంటు ఇవ్వండి) అని 75 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులను అడుగుతున్నా ఇవ్వలేకపోతున్నారు’’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. అందుబాట్లో ఉన్న వాటిని పొందేందుకు నిలదీసే దిశగా ప్రతి దేశ పౌరుడూ జాగృతం కావాల్సిన అవసరముందని అన్నారు.  బుధవారం మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన వందల మంది నేతలు, కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నపుడు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు చెందిన 50 మంది సర్పంచులు కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. వారు పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్‌ పాలన అమలు కావాలనే ఆంకాంక్షతో తాము భారాసలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

భారాసలో చేరిన మధ్యప్రదేశ్‌ సామాజిక కార్యకర్త

ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపిన వ్యాపమ్‌ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్‌రాయ్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో భారాసలో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తగా, గిరిజన హక్కుల ఉద్యమకారుడిగా ఆనంద్‌రాయ్‌ ఆ రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలు పొందారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసీ యువశక్తి సంఘటన్‌ (జేఏవైఎస్‌)’ అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక కూడా భారాసకు మద్దతు ప్రకటించింది. ఆనంద్‌రాయ్‌ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు పలువురు భారాసలో చేరారు. కేసీఆర్‌ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతోందని జేఏవైఎస్‌ వ్యవస్థాపకుడు విక్రమ్‌ అచ్చాలియా అన్నారు. ఈ సందర్భంగా సంస్థ జెండాను ఆయన కేసీఆర్‌కు కప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని