యువతను మోసం చేసిన కేసీఆర్‌, మోదీ

ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి అమలు చేయకుండా నిరుద్యోగ యువతను ప్రధాన మోదీ, సీఎం కేసీఆర్‌ మోసం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 08 Jun 2023 06:28 IST

యువజన కాంగ్రెస్‌ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి అమలు చేయకుండా నిరుద్యోగ యువతను ప్రధాన మోదీ, సీఎం కేసీఆర్‌ మోసం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడ కత్రియా హోటల్‌లో ప్రారంభమైన యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఉత్తమ్‌ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అందరూ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. శివసేనారెడ్డి ప్రసంగిస్తూ   తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ విభాగం పోషించాల్సిన పాత్రపై ఈ సమావేశాలలో చర్చిస్తామన్నారు. తెలంగాణలో పార్టీ విడుదల చేసిన యూత్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గజ్వేల్‌ నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసే పథకం అమలు చేస్తుందన్నారు. ‘యూత్‌ జోడో.. పోలింగ్‌ బూత్‌ జోడో’ కార్యక్రమం ద్వారా ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఐదుగురు యువకులను కాంగ్రెస్‌ సైనికులుగా తయారు చేసే ప్రక్రియపై చర్చించినట్లు ఆయన మీడియాకు చెప్పారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి కృష్ణ, పీసీసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ధరణిపై ప్రజాదర్బార్‌ నిర్వహించాలి: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వచ్చి ధరణిపై ప్రజాదర్బార్‌ నిర్వహించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ... ‘1981లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ నేతృత్వంలో రాజ్‌ కృష్ణారెడ్డికి సంబంధించిన 500 ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ భూమి ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్నందున ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకొని రాజ్‌ కృష్ణారెడ్డి కోడళ్ల పేరు మీదకు తిరిగి ఆ భూములను మార్చుకున్నారు’ అని ఆరోపించారు.


ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
 పీసీసీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పీసీసీ ఉపాధ్యక్షుడు రాములునాయక్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని