గంపగుత్తగా దొంగ ఓట్ల నమోదు

గుంటూరు నగరంలో తాజాగా రూపొందించిన ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దొంగ ఓట్లు గంపగుత్తగా నమోదయ్యాయి.

Updated : 08 Jun 2023 05:58 IST

ఒకే ఇంటి చిరునామాలో వందల సంఖ్యలో...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విచిత్రం

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరంలో తాజాగా రూపొందించిన ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దొంగ ఓట్లు గంపగుత్తగా నమోదయ్యాయి. ఒక ఇంటి నంబరుతో 125 ఓట్లు, ఒక కళాశాల భవనం చిరునామాలో 20 దొంగ ఓట్లు చేర్పించడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కళాశాలలు, తెలిసిన వారి నివాసాల్లో పలు దొంగ ఓట్లకు కేంద్రాలుగా మారాయి. కేవలం ఒక్క వార్డులోనే వందల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించారంటే ఏ స్థాయిలో అక్రమాలకు తెరలేపారో అర్థమవుతోంది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పేర్లు చేర్పిస్తే యంత్రాంగం కళ్లు మూసుకుని జాబితా ప్రకటించిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ జాబితా ఆధారంగా ఈనాడు-ఈటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు దాని డొల్లతనం బయటపడింది. కేవలం ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వచ్చే శ్యామలానగర్‌లోని జాబితా పరిశీలిస్తేనే దొంగ ఓట్లు వందల్లో తేలాయి. నగరం మొత్తం పరిశీలిస్తే ఈ సంఖ్య వేలల్లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్యామలానగర్‌లో గతంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పలువురు ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఆ తర్వాత  వెళ్లిపోయారు. అయినా... నేటికీ వారి ఓట్లు కొనసాగడం గమనార్హం.

* గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కేంద్రం నంబరు 38 పరిధిలోకి వచ్చే శ్యామలానగర్‌లో ఇంటి నంబరు 2-14-121తో ఉన్న నివాసంలో 125 ఓట్లు ఉన్నాయి. ఇదే నంబరుకు చివరలో 121/1లో 47 ఓట్లు, 121/12లో 59 ఓట్లు, 121/13లో 72 ఓట్లను చేర్చారు. ఇలా ఒకే ఇంటి నంబరులో ఇన్ని ఓట్లు నమోదైనా గుర్తించలేదా? ఉద్దేశపూర్వకంగా నమోదు చేశారా? అన్నది యంత్రాంగానికే తెలియాలి. ఇదే ఇంటి నంబరు (2-14-121)తో పండరీపురంలోని కేంద్రం 144లో 125 ఓట్లు నమోదు చేయడం కొసమెరుపు.

* 2-14-151లో ఓ విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక్కడ 20 మంది యువతులు ఓటర్లుగా నమోదయ్యారు. 9-1-19 ఇంటి చిరునామాతో 84 మందిని ఓటర్లుగా చేర్చారు. వీరిలో ఎక్కువ మంది స్థానికులు కాదు.

* ఎమ్మెల్యే నివాసం ఉన్న వీధిలో ఒక బహుళ అంతస్థుల భవనంలో 110 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం నివాసం ఉన్న ఓటర్లు 20 మంది మాత్రమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు