విద్యుత్‌ ఛార్జీలపై మడమ తిప్పిన జగన్‌

విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ప్రజలపై పెనుభారం మోపుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. 

Published : 08 Jun 2023 05:38 IST

వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ప్రజలపై పెనుభారం మోపుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.  దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టులో కేసు గెలిచినా ఆయనను సీబీఐ అరెస్టు చేస్తుందనే నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఓ వైపు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్న సునీత మరోవైపు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి దినపత్రిక, ఛానల్‌, నీలి మీడియా ఛానళ్లను చెక్కుచెదరని ధైర్యంతో ఎదుర్కొంటున్నారని ప్రశంసించారు. మార్గదర్శిపై విచారణ చేస్తున్నది సీఐడీ పోలీసులా.. సాక్షి మీడియానా అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. విచారణకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ సహకరించారని సీఐడీ పోలీసులు చెబుతుంటే విచారణకు ఆమె సహకరించడం లేదంటూ సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాయడం సిగ్గుచేటన్నారు. మార్గదర్శి సంస్థను ఒక మహిళా పారిశ్రామికవేత్తగా శైలజా కిరణ్‌ నిర్వహిస్తున్నారని, ఆమెను అవమానించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మహిళా సమాజం తిరుగుబాటు చేయాలని ఎంపీ సూచించారు. శైలజా కిరణ్‌ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసుకున్న సీఐడీ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారని, ఆ నోటీసుల ఆధారంగా ఆమెను విమానాశ్రయంలో అరెస్టు చేయాలనుకున్న సీఐడీ పోలీసుల పథకం బెడిసికొట్టిందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను భారతమ్మ, విజయమ్మ అంటూ సంబోధించే సాక్షి మీడియా శైలజా కిరణ్‌ అంటూ ఏకవచనంతో సంబోధించడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. సీఐడీ విచారణ సమయంలో తనకు కళ్లు తిరిగాయని, జ్వరం వచ్చిందని శైలజా కిరణ్‌ కుంటిసాకులు చెప్పారని సాక్షి దినపత్రికలో రాశారని, సీఐడీ పోలీసులు వారికేమైనా సమాచారం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మార్గదర్శికి వ్యతిరేకంగా ఒక్క ఫిర్యాదు లేకపోయినా భవిష్యత్తులో ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందనే సాకుతో మార్గదర్శి డబ్బులను ఫ్రీజ్‌ చేశామని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఒక మహిళా పారిశ్రామికవేత్తను తమ ప్రభుత్వం  వేధిస్తున్నట్లుగానే ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబంలోని పారిశ్రామికవేత్తలను రేపు ప్రభుత్వం మారాక వేధిస్తే ఎలా ఉంటుందనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు