సంక్షిప్త వార్తలు (8)

సీఎం జగన్‌ నేటి (శుక్రవారం) గుడివాడ పర్యటనకు సర్వం సిద్ధం చేయగా.. గురువారం రాత్రి పర్యటన రద్దు చేస్తున్నట్లు వైకాపా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 09 Jun 2023 05:40 IST

సీఎం గుడివాడ పర్యటన 16కు వాయిదా

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ నేటి (శుక్రవారం) గుడివాడ పర్యటనకు సర్వం సిద్ధం చేయగా.. గురువారం రాత్రి పర్యటన రద్దు చేస్తున్నట్లు వైకాపా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న సీఎం సభ ఉంటుందని పేర్కొంది. ఈ సభ కోసం ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర నాయకులు జనసమీకరణకు పోటీపడి ప్రచారం చేశారు. ఈ క్రమంలో చివరి నిమిషంలో పర్యటన రద్దయ్యింది.


టిడ్కో ఇళ్లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: భాజపా

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి గతంలో టిడ్కో ఇళ్లను నిర్మిస్తే.. వాటిని సొంత నిధులతో నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భాజపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీరాజబాబు విమర్శించారు. ఆ ఇళ్లకు నిధులిచ్చిన ప్రధాని చిత్రపటం ఎక్కడా ముద్రించకపోవడం వైకాపా చవకబారుతనానికి నిదర్శనమన్నారు.వైకాపా అసత్య ప్రచారాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.


విభజన రాజకీయాల్ని అడ్డుకోవడమే ‘వారాహి యాత్ర’ ధ్యేయం
జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీస్తూ కొందరు చేస్తున్న విభజన రాజకీయాల్ని అడ్డుకొని..అంతా కలిసిమెలసి జీవించే పరిస్థితులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు సమష్టిగా పనిచేసి ఈ యాత్రను విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. అన్ని సమస్యలకు పరిష్కారం జనసేన పాలనతోనే సాధ్యం. అన్ని వర్గాలూ కోరుకుంటుంది ఇదే. ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని నడిపిస్తున్న పవన్‌..రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించగలరు’’ అని నాగబాబు పేర్కొన్నారు.


వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్‌రాజుపై కేసు పెట్టాలి  
జాతీయ ఎస్సీ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఎస్సీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో వైకాపా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేసిన ఎస్సీలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారని, స్థానిక డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు కులం పేరుతో అసభ్యపదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు, ఆయనకు తొత్తుల్లా మారిన పోలీసులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ‘‘లాఠీఛార్జి కారణంగా ఎస్సీలు తీవ్రంగా గాయాపడ్డారు. అయినా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కనీస వైద్య సదుపాయం కల్పించలేదు. దాన్ని అడ్డుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని సైతం అరెస్టు చేశారు’’ అని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.


వైకాపాలో విజయసాయిరెడ్డిది ఉనికి సమస్య
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా తొలి మేనిఫెస్టోను విమర్శిస్తూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి వైకాపాలో ఉనికి సమస్య మొదలైందని, అందుకే తెదేపా మేనిఫెస్టోపై విమర్శలు చేసి సీఎం జగన్‌ దృష్టిలో ఉండేందుకు నానా పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘మా మొదటి ఫేజ్‌ మేనిఫెస్టోకే వైకాపా నేతలకు నిద్రపట్టడం లేదని వాళ్ల ఉలికిపాటు చూస్తేనే అర్థమవుతోంది. ఇది ఏపీ రాజకీయాల్లోంచి వైకాపాను మాయం చేసే తిరుగులేని మేనిఫెస్టో. పేదలకు రూ.రెండుకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, విజన్‌-2020తో పేదల జీవితాల్ని మార్చిన పార్టీకి ఎవరినీ కాపీ కొట్టాల్సిన పని లేదు. ఈ విషయాన్ని వైకాపా పేటీఎం బ్యాచ్‌ తెలుసుకోవాలి. దేశం రేపు చేసే ఆలోచనను చంద్రబాబు నేడే అమలు చేస్తారు. ఈ విషయం నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన మీకెలా తెలుస్తుంది. ఒక్క ఛాన్స్‌తో మీరు చేసిన మోసాల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. మళ్లీ ప్రజల్ని మోసం చేయలేరు’ అని అయ్యన్నపాత్రుడు గురువారం ట్వీట్‌ చేశారు.


ఆ ప్రమాదం ఒక మేలుకొలుపు: సీపీఎం

దిల్లీ: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వేవ్యవస్థ పరంగా ఒక మేలుకొలుపు అనీ, ఆ శాఖలో అంతా సజావుగా సాగడం లేదనే విషయాన్ని ఇది చాటుతోందని సీపీఎం పేర్కొంది. రైళ్లు వేగంగా దూసుకువెళ్తూ స్మార్ట్‌గా మారాయనే భావన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, అతి భారీ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో బాలేశ్వర్‌ ప్రమాదం బయటపెట్టిందని పార్టీ పత్రిక- ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం విమర్శించింది. ఇంత ఘోరం జరిగినా రైల్వేమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించింది. నేర కోణం ఉందో లేదో రైల్వే భద్రత కమిషనర్‌ తేల్చేలోపే సీబీఐ విచారణకు ఆదేశించడం.. దృష్టి మళ్లించే ప్రయత్నమేనంది.


ఎంసీడీ స్థాయీసంఘం ఎన్నికల్లో ఆప్‌, భాజపాలకు చెరో మూడు స్థానాలు

దిల్లీ: దేశ రాజధానిలోని దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ) స్థాయీ సంఘానికి ఆప్‌, భాజపాల నుంచి మగ్గురు చొప్పున సభ్యులు ఉండనున్నారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 24న జరిగిన ఎన్నికల ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. స్థాయీ సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టిన దిల్లీ హైకోర్టు, తక్షణం ఫలితాలు ప్రకటించాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థాయి సంఘం సభ్యుల ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మేయర్‌ ఒబెరాయ్‌ తెలిపారు. వీలైనంత త్వరగా కమిటీలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. దిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించినా.. అన్ని కార్యనిర్వాహక నిర్ణయాలు కమిటీ తీసుకుంటుంది. మరోవైపు, స్థాయీ సంఘంలో అధికార ఆప్‌నకు, ప్రతిపక్ష భాజపాకు సమానంగా (చెరో ముగ్గురు) సభ్యులు ఉండడంతో నగరపాలక సంస్థ పనితీరుపై ప్రభావం చూపే అవకాశముంది.


2024 ఎన్నికలపై విపక్షాల ఆశలు బిహార్‌ వంతెనలా కొట్టుకుపోతాయ్‌

ప్రతిపక్షాల భేటీపై భాజపా విసుర్లు

దిల్లీ: దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో జేడీయూ అగ్రనేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఈ నెల 23న పట్నాలో నిర్వహిస్తున్న భేటీపై భాజపా విమర్శలు సంధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న విపక్ష నేతల ఆశలు...ఇటీవల బిహార్‌లోని నదిలో కుప్పకూలిన రూ.1,750 కోట్ల వంతెన మాదిరిగా కొట్టుకుపోతాయంటూ కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. విపక్షాల ఐక్యత యత్నాలు భాజపాకు వణుకుపుట్టిస్తున్నాయని బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ‘కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఓటమితో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి అధికార భాజపా భయపడుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలోనూ కమలం పార్టీకి ఓటమి తప్పదు’ అని తేజస్వీ జోస్యం చెప్పారు. విపక్షాల భేటీకి తాను హాజరవుతున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ గురువారం వెల్లడించారు. నీతీశ్‌ నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని