తెదేపా నియోజకవర్గ బాధ్యులు రాజులు కాదు

తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అనే వాళ్లు రాజులు, సామంతులు కాదని, వాళ్లది రాజ్యాంగ పదవేమీ కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated : 09 Jun 2023 05:27 IST

మహానాడుకు ఆహ్వానం రాలేదు
విజయవాడ ఎంపీ కేశినేని నాని

విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అనే వాళ్లు రాజులు, సామంతులు కాదని, వాళ్లది రాజ్యాంగ పదవేమీ కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కేశినేని భవన్‌ వద్ద తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలంలోని 16 గ్రామాలకు తాగునీటి ట్యాంకర్లను అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని విలేకరులతో మాట్లాడారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఒక ఇన్‌ఛార్జి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారని, ఆ కార్యక్రమానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చారని, తనకు ఆహ్వానం లేదన్నారు. అలా చేసి ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మహానాడుకు తనను ఎవరూ పిలవలేదని, తన పాత్ర అక్కడ లేదని తెలిసిందన్నారు. అక్కడ ఎంపీ రామ్మోహన్‌నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదని చెప్పారన్నారు. దీంతో దిల్లీ వెళ్లి పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించినట్లు చెప్పారు. ఇటీవల అమిత్‌షాను కలిసేందుకు దిల్లీకి చంద్రబాబు వెళ్లినప్పుడు ఆయన పీఏ ఫోన్‌ చేసి రమ్మనడంతో బాధ్యతగా వెళ్లి కలిసినట్లు వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు తనను తిట్టినవాళ్లు, చెప్పు తీసుకుని కొడతా అన్న వాళ్లు ఉన్నారని, అలాంటి వాళ్ల ఫొటోలు తన కార్యాలయం బయటే ఉన్నాయంటూ చేయి ఎత్తి వారి చిత్రాలను ఎంపీ చూపించారు. అలాంటి వారి మాటలను తాను పట్టించుకోనని, ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. పొమ్మనలేక పొగ పెడుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా..ఆ విషయం చంద్రబాబును అడగాలని, పొగ బాగా గట్టిగా వచ్చినప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచిస్తానని తెలిపారు. టాటా ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశానని, ప్రజలు కోరుకుంటే స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా వారితో టచ్‌లో ఉన్నారనే ప్రశ్నకు.. తాను అన్ని పార్టీల వారితో టచ్‌లోనే ఉంటానని, కమ్యూనిస్టులతో కూడా ఉంటానని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని