Nara Lokesh: పులివెందులకూ జగన్‌ మోసం

తల్లికి, చెల్లికి అన్యాయం చేయడమే కాదు.. తనను గెలిపించిన పులివెందుల ప్రజలనూ సీఎం జగన్‌ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 09 Jun 2023 05:42 IST

తెదేపా నాయకుల భేటీలో లోకేశ్‌ విమర్శ
సీఎం సొంతూరికీ పరిశ్రమలు తీసుకొస్తాం
ఢీ అంటే ఢీ అనే వారికే పార్టీలో స్థానం

ఈనాడు, కడప: తల్లికి, చెల్లికి అన్యాయం చేయడమే కాదు.. తనను గెలిపించిన పులివెందుల ప్రజలనూ సీఎం జగన్‌ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. పులివెందులలో తెదేపా గెలవకపోయినా ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎలాంటి మనస్పర్థలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలన్న యువనేత.. అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా పులివెందులలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో గురువారం పులివెందుల నేతలతో భేటీలోనూ, అనంతరం పాదయాత్రలోనూ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ‘పులివెందుల ప్రజలు కూడా జగన్‌ బాధితులే. జగన్‌ను 90 వేల మెజార్టీతో గెలిపించిన పులివెందులవాసులకు ఏం చేశారు? ఒక్క పరిశ్రమ తెచ్చారా? కనీసం రోడ్లు వేశారా? రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతికి తప్ప జగన్‌ పులివెందులకు ఎప్పుడు వస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. ‘పార్టీలో సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తాం. పని చేసేవారికే పదవులు ఇస్తాం. కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటే కుదరదు. గ్రూపు రాజకీయాలను ఏ మాత్రం సహించం. వైయస్‌ఆర్‌ జిల్లాలో పార్టీకి పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ ఉంది. దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలి. విపక్షంతో ఢీ అంటే ఢీ అనే వాళ్లనే గుర్తిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘మిషన్‌ రాయలసీమ’ కింద పులివెందులకు పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఈసారి పులివెందుల సహా గెలిచే అవకాశాలున్నాయని, నేతలు ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయవాదులతోనూ ముఖాముఖి నిర్వహించి, వారి కష్టాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు అభివృద్ధి, జగన్‌ విధ్వంసం

కడప సమీపంలో టిడ్కో ఇళ్లను చూపిస్తూ సీబీఎన్‌ కన్‌స్ట్రక్షన్‌ అంటూ పక్కనే తవ్వేసిన పాలకొండని చూపిస్తూ జగన్‌డిస్ట్రక్షన్‌ అంటూ లోకేశ్‌ సెల్ఫీలు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు