అధికారంలోకి రాగానే భూ నిర్వాసితులకు పరిహారం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హామీఇచ్చారు.

Published : 09 Jun 2023 04:19 IST

సీఎల్పీ నేత భట్టి హామీ

ఈనాడు, నల్గొండ- దేవరకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హామీఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భాజపాలోని కీలక నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా గురువారం నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టును ఆయన సందర్శించారు. భూ నిర్వాసితులతో సమావేశమై మాట్లాడారు. ‘‘తొమ్మిదేళ్లలో నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరానికైనా అదనంగా నీరిచ్చారా..? సాగునీటి దినోత్సవం జరిపేందుకు ఈ ప్రభుత్వానికి అర్హత లేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసే చిత్తశుద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డికి లేదు. నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ  ఇవ్వలేదు. 2014 నాటికే రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పూర్తయి ఉన్నాయి. తెలంగాణకు అదనంగా 54శాతం విద్యుత్తు ఇవ్వాలని నాటి యూపీఏ ఛైర్మన్‌ సోనియాగాంధీ దగ్గరుండి నాడు చట్టం చేయించారు. అందువల్లే నేడు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ఆ శాఖ అధికారులు, ఈఎన్‌సీలు వెళ్లకుండా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి స్మితా సభర్వాల్‌ వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది’’ అని భట్టి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు పంపిన లేఖను ఈ సందర్భంగా విడుదల చేశారు. పోలీసు సిబ్బంది ప్రజలందరి కోసం పని చేసేలా చూడాలని లేఖలో కోరారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నక్కలగండి ప్రాజెక్టు నుంచి పాతూరు తండా స్టేజీ వరకు పాదయాత్రలో పాల్గొని భట్టిని అభినందించారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, దేవరకొండ పార్టీ ఇన్‌ఛార్జి బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని