తెలంగాణ పథకాలు మహారాష్ట్ర ప్రజలకూ అందించడమే లక్ష్యం

మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్ఫూర్తితో భారాస పనిచేస్తోందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Published : 09 Jun 2023 04:19 IST

అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలి
మరాఠా నేతలకు భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్ఫూర్తితో భారాస పనిచేస్తోందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు భారాసను ఆదరిస్తున్న తీరు సంతోషకరమని చెప్పారు. ఎన్నో నదులు ఉన్నప్పటికీ మరాఠా రైతులకు అక్కడి ప్రభుత్వాలు సాగునీరు అందించలేకపోవడం బాధాకరమన్నారు. ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయినా గాని.. మహారాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ చేపట్టామని, పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత సాగునీరు సహా వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టి, రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. మహారాష్ట్ర నుంచి భారాసలోకి చేరికలు కొనసాగుతున్న నేపథ్యంలో.. గురువారం ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ నమూనా పాలనే ఎజెండాగా మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో భారాస విస్తరణ చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో 9 కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో అందిస్తున్న సంక్షేమ పాలన గురించి కరపత్రాలు, పుస్తకాలు, సోషల్‌ మీడియా, పోస్టర్లు, హోర్డింగ్‌లు తదితర మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తాజాగా భారాసలో చేరిన వారిలో సామాజిక కార్యకర్త డాక్టర్‌ సుభాష్‌ రాథోడ్‌, సేనా సంఘటన్‌కు చెందిన ఉమేశ్‌ చవాన్‌, భాజపాకు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ దీపక్‌ పవార్‌, భారత్‌ పవార్‌, అకోలా బజార్‌, ప్రకాశ్‌ రాథోడ్‌, శివసేన నేత రాజేశ్‌ పవార్‌, శివసేన శిందే వర్గానికి చెందిన పర్వీన్‌ చవాన్‌ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర భారాస నాయకులు శంకర్‌ అన్నా దొండ్గే, మాణిక్‌ కదం, టీఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ వేణుగోపాలచారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని