మాట తప్పడమే జగన్‌ విశ్వసనీయత

ఏ హామీ అమలు చేయకుండానే 99.5% హామీలను అమలు చేసినట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పడం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 09 Jun 2023 05:04 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజం

ఈనాడు, దిల్లీ: ఏ హామీ అమలు చేయకుండానే 99.5% హామీలను అమలు చేసినట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పడం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. మాట తప్పడమే ఆయన విశ్వసనీయత అని ఎద్దేవా చేశారు. దిల్లీలోని తన నివాసంలో గురువారం ఎంపీ విలేకర్లతో మాట్లాడారు. ‘సీపీఎస్‌ రద్దుతో పాటు, ఐఆర్‌ వెంటనే అమలు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్‌ చెప్పిన మాటలు విని ఉద్యోగులు, నిరుద్యోగులు ఓట్లు వేశారు. మద్యనిషేధం అమలు చేస్తామన్న హామీని మహిళలు నమ్మారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రతి బిడ్డకూ డబ్బులు ఇస్తామని చెప్పడంతో ముగ్గురు పిల్లలు ఉన్నవారు రూ.45 వేలు వస్తాయని కలలుగన్నారు. జగన్‌ ఈ హామీలన్నీ తుంగలో తొక్కారు. గ్యారంటీ లేని ఒక పెన్షన్‌ స్కీమును తీసుకొచ్చి గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ అని చెప్పడం హాస్యాస్పదం. సీపీఎస్‌ కోసం ఉద్యోగుల జీతాల్లో 10% కట్‌ చేస్తున్న ప్రభుత్వం, తన వంతుగా జమ చేయాల్సిన 10% మొత్తాన్ని మూడు నెలలుగా జమ చేయడం లేదు’ అని రఘురామ ధ్వజమెత్తారు. జీతాలే సరిగా ఇవ్వని ఈ ప్రభుత్వం.. కొత్త పింఛను విధానం తీసుకొచ్చి రిటైరయ్యాక పెన్షన్‌ డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని