పథకాల లబ్ధి కంటే.. విద్యుత్తు ఛార్జీల దోపిడే ఎక్కువ

సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్‌ చేకూరుస్తున్న మేలు కంటే నాలుగేళ్లలో విద్యుత్తు ఛార్జీల బాదుడుతో ప్రజల నుంచి దోచుకున్నదే ఎక్కువని తెదేపా ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు.

Published : 09 Jun 2023 05:04 IST

ఇండోసోల్‌ నుంచి ఒక్క యూనిట్‌ కొంటూ.. రెండు యూనిట్లకు చెల్లింపులు
ప్రజలపై రూ.57 వేల కోట్ల భారం
పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్‌ చేకూరుస్తున్న మేలు కంటే నాలుగేళ్లలో విద్యుత్తు ఛార్జీల బాదుడుతో ప్రజల నుంచి దోచుకున్నదే ఎక్కువని తెదేపా ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. నేరుగా యూనిట్‌ ధరలు పెంచకుండా.. ట్రూఅప్‌ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జీలంటూ రకరకాల పేర్లతో సామాన్యుల్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబం విద్యుత్తు ఛార్జీల రూపేణా 2014-19 వరకు తెదేపా హయాంలో, తర్వాత వైకాపా పాలనలో సగటున ఎంత మేర చెల్లించారో లెక్కలు బయటపెట్టాలని సవాలు విసిరారు. ప్రభుత్వ అసమర్థత, కమీషన్ల కక్కుర్తి, నాసిరకం బొగ్గు కొనుగోళ్లతో ఏడుసార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.57 వేల కోట్ల అదనపు భారం వేశారని మండిపడ్డారు. గురువారం పయ్యావుల జూమ్‌ యాప్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘తక్కువ ధరకు లభించే విద్యుత్‌ను కాదని, ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేవారి నుంచి అధిక ధరకు కొంటోంది. దీంతో డిస్కంలు భారాన్ని మోయాల్సి వస్తోంది. నాసిరకం బొగ్గు కొని విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల థర్మల్‌ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కరెంటు కోతలు పెరిగాయి. హిందూజా నుంచి ఒక్క యూనిట్‌ విద్యుత్తు కొనకపోయినా ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు రూ.2,200 కోట్లు చెల్లిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసే అవకాశమున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకే సిద్ధపడింది. ఇండోసోల్‌ నుంచి ఒక్క యూనిట్‌ విద్యుత్తు కొంటూ.. రెండు యూనిట్లకు చెల్లిస్తున్నారు’ అని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘తెదేపా ప్రభుత్వం ఏపీని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చింది. కొత్తగా పైసా ఛార్జీలు పెంచలేదు. 9 వేల మెగావాట్ల ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీని 19 వేల మెగావాట్లకు పెంచాం. ఈ నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం అదనంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేసింది లేదు. ఎన్‌డీపీసీ నుంచి ఏపీకి రావాల్సిన 244 మెగావాట్లు, ఎన్‌డీఈసీఎల్‌ (వల్లూరు) నుంచి 86, ఎన్‌డీపీఎల్‌(తమిళనాడు) నుంచి 121, ఎన్‌ఎన్‌టీఎస్‌ నుంచి 52 ఇలా సుమారు 500 మెగావాట్లు ఏపీకి వాటాగా రావాల్సి ఉంది. దీన్ని వాడుకునే ప్రయత్నం చేయలేదు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రానున్న ఏడేళ్లలో మరో అదనపు దోపిడీకి తెరలేపారు’ అని కేశవ్‌ ఆరోపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని