ఖమ్మంలో లక్ష మందితో అమిత్‌షా బహిరంగ సభ

ఖమ్మంలో గురువారం జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

Published : 10 Jun 2023 05:36 IST

బండి సంజయ్‌

ఈటీవీ- ఖమ్మం: ఖమ్మంలో గురువారం జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి లక్ష మందిని సభకు తరలించాలని నాయకులకు సూచించారు. సభ విజయవంతానికి సీనియర్‌ నాయకులతో కమిటీని నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని ముగిసిందని, జాకీ పెట్టినా లేచే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. భాజపా గ్రాఫ్‌ను దెబ్బతీసేందుకు భారాస, కాంగ్రెస్‌ పనిచేస్తున్నాయని ఆరోపించారు. అమిత్‌షా సభ తర్వాత కొత్తగూడెంలో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో సభాస్థలిని సంజయ్‌ పరిశీలించారు. పార్టీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అస్సాం సీఎం హిమంతతో ఈటల భేటీ!

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ముఖ్యనేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ శుక్రవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో భేటీ అయినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈటలను త్వరలో భాజపా రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. హిమంత బిశ్వశర్మ 2015లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన తర్వాత అస్సాంలో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌.. అస్సాం సీఎంతో భేటీ కావడంపై భాజపా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిమంత బిశ్వశర్మలాగా ఈటలకు కూడా పార్టీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని