సంక్షిప్త వార్తలు(9)

ఎండ వేడికి తట్టుకోలేక మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లోంచి బయటకు రానప్పుడు.. చిన్న పిల్లలు మాత్రం పాఠశాలలకు ఎలా వస్తారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు.

Updated : 10 Jun 2023 06:26 IST

పాఠశాలల పునఃప్రారంభాన్ని పది రోజులు వాయిదా వేయాలి
సీఎం జగన్‌కు తెదేపా ఎమ్మెల్యే అనగాని లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎండ వేడికి తట్టుకోలేక మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లోంచి బయటకు రానప్పుడు.. చిన్న పిల్లలు మాత్రం పాఠశాలలకు ఎలా వస్తారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. జూన్‌ రెండో వారం ముగుస్తున్నా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్‌ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల పున:ప్రారంభ నిర్ణయాన్ని మరో పది రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వానికి స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ నాడు-నేడు పనులు పూర్తి చేయడంలో ఎందుకు లేదు?’ అని పేర్కొన్నారు.


భారాస పాలకులకు గుణపాఠం చెబుతాం: భట్టి

చందంపేట, న్యూస్‌టుడే: రైతులకు మేలు చేయడానికి అంటూ ధరణిని తీసుకొచ్చి భూ కుంభకోణానికి పాల్పడిన భారాస పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా చందంపేట మండలం గన్నెర్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాల భూమిని భారాస సర్కారు ధరణి ద్వారా కుట్రపూరితంగా వెనక్కి తీసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. బహుళజాతి కంపెనీలకు కేటీఆర్‌ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. భారాస అగ్రవర్ణాల పక్షాన నిలిస్తే.. కాంగ్రెస్‌ ప్రజల పక్షాన ఉంటుందని, ధైర్యం ఉంటే ప్రజాసమస్యలపై బహిరంగ చర్చకు కేసీఆర్‌, కేటీఆర్‌ సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.


‘ప్రియాంక మెదక్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలి’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేయించాలని తమ అధిష్ఠానాన్ని కోరనున్నట్లు పీసీసీ మేధావుల విభాగం అధ్యక్షుడు శ్యామ్‌మోహన్‌ తెలిపారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ సభ్యులు వి.హనుమంతరావు, జి.నిరంజన్‌, కమలాకర్‌రావు, గౌతమ్‌ ఆకునూరు, జనార్దన్‌, రామారావు, సలీం, రవీంద్రప్రసాద్‌ తదితరులతో సమావేశం నిర్వహించారు. అనంతరం శ్యామ్‌మోహన్‌ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రియాంక మెదక్‌ నుంచి పోటీ చేస్తే పార్టీకి కలిసొస్తుంది అని అన్నారు.


రేపు విశాఖకు అమిత్‌షా

విశాఖపట్నం(పెదవాల్తేరు), న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 11న విశాఖ పర్యటనకు రానున్నారని భాజపా విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన నేపథ్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు రైల్వే మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు పోర్ట్‌ అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సాగరమాల కన్వెక్షన్‌ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమై, 10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి వెళ్తారని పేర్కొన్నారు.


నేడు తిరుపతి జిల్లాకు భాజపా అధ్యక్షుడు నడ్డా

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: భాజపా జాతీయ అధ్యక్షుడు జేెపీ నడ్డా శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం తిరుచానూరు జాతీయ రహదారి సమీపంలో రాహుల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో చిత్తూరు పార్లమెంట్‌ జిల్లా శక్తి కేంద్ర ఇన్‌ఛార్జులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాళహస్తికి బయలుదేరి ముక్కంటిని దర్శించుకుంటారు. 4.15 గంటలకు శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లనున్నారు.


రైల్వే భద్రత నిధుల్ని ఖర్చు చేసేది ఇలాగేనా?: కాంగ్రెస్‌

దిల్లీ: రైల్వేలో భద్రత కోసం ఉద్దేశించిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. పింగాణీపాత్రల కొనుగోళ్లు, కార్లకు అద్దెలు, ఫర్నిచర్‌, లాప్‌టాప్‌లు కొనడానికి కూడా ఇవే నిధుల్ని వాడారని 2021 మార్చిలో విడుదల చేసిన కాగ్‌ నివేదిక పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. రైల్వే భద్రత నిధుల్ని వాడేది ఇలాగేనా అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్లో ప్రశ్నించారు. కాళ్లకు మర్దనాచేసే యంత్రాలనూ ఈ నిధులతోనే కొన్నారని చెప్పారు. పట్టాలను మార్చడానికి ఏటా రూ.20,000 కోట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇటీవల ప్రశ్నించారు. ఈ అంశాలపై కాగ్‌కు రైల్వే త్వరలోనే సమాధానం ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైల్వేలో భద్రత పనులపై 2017-18 నుంచి 21-22 మధ్య రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే.


గుజరాత్‌ పీసీసీ అధ్యక్షునిగా శక్తిసింహ్‌ గోహిల్‌

పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించిన హస్తం పార్టీ

దిల్లీ: రాజ్యసభ ఎంపీ శక్తిసింహ్‌ గోహిల్‌ను గుజరాత్‌ పీసీసీ నూతన అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. ఇప్పటి వరకూ హరియాణా, దిల్లీలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ వి.వైథిలింగం నియమితులయ్యారు. హరియాణా, దిల్లీలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా దీపక్‌ బాబరియా వ్యవహరించనున్నారు. ముంబయి రీజనల్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వర్ష గైక్వాడ్‌ బాధ్యతలు చేపడతారు. మన్సూర్‌ అలీఖాన్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. దీంతో పాటు ఆయనను ఏఐసీసీ ఇన్‌ఛార్జి (తెలంగాణ)కు జత చేశారు. ఏఐసీసీ కార్యదర్శి హోదా నుంచి పి.సి.విష్ణునాథ్‌ను రిలీవ్‌ చేసి...ఏఐసీసీ ఇన్‌ఛార్జి(తెలంగాణ)కు జత చేశారు. ఏఐసీసీ కార్యదర్శి బాధ్యతల నుంచి ఎన్‌.ఎస్‌.బోస్‌రాజు, నదీమ్‌ జావెద్‌లను రిలీవ్‌ చేశారు. ఈ నియామకాలు, మార్పులకు సంబంధించిన వివిధ ఉత్తర్వులను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విడుదల చేశారు.


జాతీయ ప్రధాన కార్యదర్శులతో భాజపా అధ్యక్షుడు నడ్డా భేటీ

దిల్లీ: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీపరమైన విషయాలను, రాజకీయ అంశాలను చర్చించారు. పార్టీకి చెందిన ఎంపీలందరితోనూ త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అధికార ఎన్డీయే కూటమిని విస్తరించాలన్న ఆలోచన భాజపా అధిష్ఠానానికి ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా వరసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ సహా అధికార పార్టీ సీనియర్‌ నేతల మధ్య విస్తృత చర్చల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశమయ్యారు. కీలకమైన రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికలు, వచ్చేఏడాది రానున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంస్థాపరమైన మార్పుల్ని భాజపా చేయవచ్చని తెలుస్తోంది.


పైలట్‌ సొంత పార్టీ ఏర్పాటుపై అన్నీ ఊహాగానాలే: కాంగ్రెస్‌

దిల్లీ: రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నారనే వార్తల్ని కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్థంతినాడు సచిన్‌ కొత్త పార్టీని ప్రకటిస్తారన్న ప్రచారాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తోసిపుచ్చారు. తాను ఆయనతో మాట్లాడుతూనే ఉన్నానని, అందరం కలిసే రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. రాజస్థాన్‌లో పార్టీ ఐక్యంగానే ఉందన్నారు. తన డిమాండ్లపై ప్రభుత్వంలో కదలిక లేదని సచిన్‌ భావిస్తున్నట్లు పైలట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు, పేపర్ల లీకేజీలపై చర్యలు వంటి డిమాండ్ల విషయంలో ఆయన పట్టుదలతో ఉన్నారని వెల్లడించాయి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని