వివేకా హంతకుల్ని కాపాడటానికి జగన్‌ ఎక్కని మెట్లు లేవు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని కాపాడటానికి సీఎం జగన్‌ పడని తంటాలు, ఎక్కని మెట్లు, మొక్కని దేవుడు లేడని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

Published : 10 Jun 2023 03:46 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని కాపాడటానికి సీఎం జగన్‌ పడని తంటాలు, ఎక్కని మెట్లు, మొక్కని దేవుడు లేడని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అసలు సీబీఐ విచారణపైనే ప్రజలు పెదవి విరుస్తున్నారని, ఈ కేసును కడపలోని ఎస్‌ఐకి అప్పగించినా.. నిందితులు ఈ పాటికి జైలు ఊచలు లెక్కపెడుతుండేవారని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని, దీని వెనుక విశాలమైన కుట్ర ఉందంటూ మే 26న సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ అవినాష్‌రెడ్డికి బెయిల్‌ వస్తే పండగ చేసుకుంటారా? బెయిల్‌ వచ్చినంత మాత్రాన ఆయన నిర్దోషి అవుతారా? 11 కేసుల్లో జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. ఆయన నిర్దోషా? వివేకా హత్య కేసులో వేళ్లన్నీ జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డి వైపే చూపుతున్నాయి. సొంత బాబాయ్‌ హత్య గురించి ఆయన పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకంటే హంతకులు జగన్‌కు అత్యంత ఆప్తులు.ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని సీబీఐ చెప్పాక కూడా సీఎం పదవిలో కొనసాగడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. అసలు ఈ హత్యతో తనకే సంబంధం లేదని చెప్పే దమ్ముందా?...’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని