Nara Lokesh: దోపిడీలో జగన్‌తో వైకాపా నేతలు పోటీ

ముఖ్యమంత్రి జగన్‌తో వైకాపా నేతలు పోటీపడి దోపిడీకి పాల్పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 10 Jun 2023 05:53 IST

ఎమ్మెల్యే మేడా, జడ్పీ ఛైర్మన్‌  ఆకేపాటిపై ఆరోపణలు
సిద్దవటం బహిరంగ సభలో లోకేశ్‌

ఈనాడు, కడప: ముఖ్యమంత్రి జగన్‌తో వైకాపా నేతలు పోటీపడి దోపిడీకి పాల్పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్‌ దోచుకుంటుండగా.. రాజంపేటను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కొల్లగొడుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర శుక్రవారం రాజంపేట నియోజకవర్గ పరిధిలో సాగింది. సిద్దవటంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు అన్యాయం తెలుసుకున్నాక రాష్ట్రంలో ఇంత చేతగాని ఎమ్మెల్యే ఎవరూ లేరని తేలిపోయింది. బినామీల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కొట్టేశారు’ అని ఆరోపించారు. ‘జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సైతం భూకుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారు’ అని విమర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు కేవలం ఆర్డీవోపై చర్యలు తీసుకుని సరిపుచ్చారన్నారు. భూములు కొట్టేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌ కలిసి రూ.కోట్ల జడ్పీ నిధులను కాజేశారని ఆరోపించారు. జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ఇద్దరూ ఊరుకో ప్యాలెస్‌ కట్టుకున్నారని వివరించారు. హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, రాజంపేటతోపాటు స్వగ్రామాల్లోనూ ప్యాలెస్‌లు ఉన్నాయన్నారు. వారిద్దరూ కలిసి స్వార్థ ప్రయోజనాల కోసం రాజంపేటను సర్వనాశనం చేశారని విమర్శించారు. రాజంపేట జిల్లాకేంద్రం కాకుండా, వైద్య కళాశాల రాకుండా చేయడంపై వారు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఇసుక దోచుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో అమ్ముకుంటున్నారని విమర్శించారు.

* సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను పసిగట్టిన ప్రభుత్వం ఆదోనిలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ గత నెల 31న ఆగమేఘాలపై జీవోనిచ్చిందని లోకేశ్‌ తెలిపారు. యువగళం ప్రజల్లో చైతన్యాన్ని రగల్చడమేగాక దున్నుపోతు సర్కారులోనూ చలనం తెస్తోందనడానికి ఈ జీవోనే ఉదాహరణ అని అన్నారు. ‘తెదేపా అధికారంలోకి రాగానే నీకు కోడిగుడ్ల సన్మానం ఖాయం. క్లెమోర్‌మైన్లకే భయపడని కుటుంబం మాది. కోడిగుడ్డు బ్యాచ్‌కు భయపడతామా? నా మీద కోడిగుడ్లు వేయించి ఎక్కడికి పారిపోతావు’ అంటూ నిప్పులు చెరిగారు.


‘మార్గదర్శి’... మీవిలా సూట్‌కేసు కంపెనీ కాదు

‘జగన్‌ తెలుసుకోవాల్సింది ఏమంటే ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ మీ కంపెనీల్లాగా సూట్‌కేసు కంపెనీ కాదు. అసలు మార్గదర్శిపై ఎక్కడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కక్ష సాధింపుతో విచారణ అంటూ హడావుడి చేస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మంగళవారం రాత్రి సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ విచారణకు సహకరించారని అన్నారు. మంచిగా మాటలు చెప్పిన అధికారి.. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన సంకేతాలతో స్వరం మార్చారు. 14 గంటల్లోనే మాట మార్చి విచారణకు సహకరించలేదంటూ మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారు. కక్ష సాధింపునకు ఇదొక ఉదాహరణ’ అంటూ లోకేశ్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని