సీఎం సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఆత్మహత్యాయత్నం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. సీఎం సమీప బంధువు దుగ్గాయపల్లె వీరారెడ్డి ఇసుక వ్యాపారం పేరిట తనను మోసం చేశాడంటూ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

Published : 10 Jun 2023 03:46 IST

జగన్‌ సమీప బంధువు వీరారెడ్డి మోసం చేశాడని..
ఇసుక రేవును సబ్‌లీజుకు తీసుకుని నష్టపోయిన వ్యాపారి నారాయణరెడ్డి

ఈనాడు-కడప: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. సీఎం సమీప బంధువు దుగ్గాయపల్లె వీరారెడ్డి ఇసుక వ్యాపారం పేరిట తనను మోసం చేశాడంటూ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన పోకల నారాయణరెడ్డి పోరుమామిళ్ల పట్టణంలో స్థిరపడ్డారు. దుగ్గాయపల్లె వీరారెడ్డికి డబ్బులు చెల్లించి కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఇసుక రేవు లీజు దక్కించుకున్నారు. కొన్నాళ్ల పాటు అక్కడ తవ్వకాలు జరిపి వ్యాపారం నిర్వహించారు. ఆ రేవుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. అది అనధికారిక రేవుగా తేలిన నేపథ్యంలోనే గత మూడు నెలలుగా అక్కడ తవ్వకాలు ఆగిపోయాయి. ఆ ఇసుక రీచ్‌ కేటాయింపునకు వీరారెడ్డి భారీగా డబ్బులు తీసుకున్నారని, పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలు జరగనందున తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానంటూ నారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. నష్టపోయిన సొమ్ము తిరిగి చెల్లించాలంటూ వీరారెడ్డిని ఆయన గత కొన్ని నెలలుగా అడుగుతున్నారు. అయినా దానికి వీరారెడ్డి నుంచి సానుకూల స్పందన లేకపోగా, తిరిగి అతని నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. దాంతో శుక్రవారం గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద వీరారెడ్డి నిర్వహిస్తున్న ఇసుక రేవు వద్దకు వెళ్లి నారాయణరెడ్డి పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి దిగారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆయనను బద్వేలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా... ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.

అధికార పార్టీ నేతల ద్వారానే అక్రమ తవ్వకాలు

సిద్దవటం మండలంలోని జ్యోతి, ఎస్‌.రాజంపేట, జంగాలపల్లె రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా.. పలువురు అధికార పార్టీ నేతల ద్వారా అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడి నుంచి లారీల ద్వారా హైదరాబాదు, బెంగళూరుకు ఇసుక ఎగుమతి జరుగుతోంది. స్థానికులకు ఇవ్వడం లేదు. నిత్యం 300 వరకు లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోంది. ఇది వరకు మండలంలోని వైకాపా నేతలకు రేవులను పంచి పెట్టి ఒక్కో రేవుకు నెలకు రూ.3 కోట్ల వంతున అనధికారికంగా వసూలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వారానికి కొంత వంతున చెల్లించాలనే ఒప్పందంతో వ్యవహారం సాగుతూ వచ్చింది. నష్టాల పేరిట వారు తప్పుకోగా.. ఇప్పుడు కొందరు పార్టీ నేతలే సొంతంగా తవ్వకాలు చేపడుతున్నారు.
- గనులశాఖ అధికారులే అనుమతులు లేవని చెబుతున్నా.. అక్రమ తవ్వకాల విషయం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) చూసుకోవాలని ఆ శాఖ దాట వేస్తోంది. ఎస్‌ఈబీ మాత్రం రేవుల వైపు చూడడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. అనుమతుల్లేని రేవుల నుంచి జేపీ కంపెపీ పేరిట రశీదులు జారీ చేస్తున్నారు. పెండ్లిమర్రి, చక్రాయపేట, ఖాజీపేట మండలాల పరిధిలోని రేవుల నుంచి నిత్యం భారీ ఎత్తున తవ్వకాలు... రవాణా జరుగుతోంది. ఖాజీపేట పరిధిలో పెన్నానదిలో చెన్నముక్కపల్లె రేవులో చాలా వరకు ఇసుక లేకుండా ఊడ్చేశారు. నాలుగున్నర హెక్టార్ల పరిధిలో ఏడాది కాలంలో తవ్వుకోవాలనే నిబంధనతో అనుమతులు జారీ చేయగా ఏడు నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి. నెలకు 3,600 క్యూబిక్‌ మీటర్లు.. రోజుకు 120 క్యూబిక్‌ మీటర్ల వంతున.. 45,300 వరకు తవ్వుకోవాల్సి ఉండగా.. విచ్చలవిడిగా... అందులోనూ మీటరు లోతుకు అనుమతులు పొంది 20 అడుగుల వరకు యంత్రాలతో ఇసుక తవ్వేశారు. ఇతర రేవుల్లో అనుమతులు కంటే అధికంగా తవ్వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులిచ్చిన అధికారులు రేవుల వైపు అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ఎస్‌ఈబీ అయితే ఇసుక వైపే వెళ్లడం లేదని చెబుతున్నారు.

తెరపైకి మరో వ్యవహారం

* ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామం వద్ద శుక్రవారం ఇసుక తరలిస్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీలను ఆపారు. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలతో పరిసరాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని వివరించారు. ఈ రేవులోనూ అధికార పార్టీ నేతలే తవ్వకాలు చేపడుతున్నారు. తాజాగా గనులశాఖ విడుదల చేసిన జాబితాలో ఈ రేవుకు అనుమతులు లేకపోవడం విశేషం.

* ఇసుక తవ్వకాలకు జేపీ కంపెనీకి గనులశాఖ కొన్ని రేవులకు మాత్రమే అనుమతులిచ్చింది. అనధికారికంగా సిద్ధవటం మండలం జ్యోతి, జంగాలపల్లె, వల్లూరు మండలంలో ఆదినిమ్మాయపల్లె వద్ద భారీ తవ్వకాలు చేపట్టారు. ఆదినిమ్మాయపల్లెలో స్థానికులు, తెదేపా నేతల అభ్యంతరం నేపథ్యంలో తవ్వకాలు ఆగిపోయాయి. జ్యోతి, జంగాలపల్లె రేవులో అనధికారికంగా తవ్వకాలు చేపట్టి లారీలతో హైదరాబాదు, బెంగళూరు నగరాలకు నిత్యం ఎగుమతి చేస్తున్నారు. ఈ పెన్నానది ఇసుకకు ఆయా నగరాల్లో నాణ్యత పరంగా మంచి డిమాండ్‌ ఉంది.


జగన్‌ వాళ్ల నాయనకైనా చెప్పుకో... డబ్బులివ్వనంటున్నారు

ఇసుక రీచ్‌కు వీరారెడ్డి  రూ.81 లక్షలు కట్టించుకున్నారు
తిరిగి చెల్లించమని అడుగుతుంటే బెదిరిస్తున్నారు:
బాధితుడు నారాయణరెడ్డి గోడు

ఈనాడు-అమరావతి, కడప: ‘‘ఆదినిమ్మాయపల్లెలో ఇసుక రీచ్‌ కేటాయిస్తానంటూ దుగ్గాయపల్లె వీరారెడ్డి నా వద్ద నుంచి రూ.81 లక్షలు కట్టించుకున్నారు. అది అనుమతుల్లేని దొంగ రీచ్‌ కావడంతో మూసేశారు.  నేను తీవ్రంగా నష్టపోయా. ఆ సొమ్ము చెల్లించాలని వీరారెడ్డిని అడుగుతుంటే నన్ను బెదిరిస్తున్నారు....’’ అని వైయస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట వాసి పోకల నారాయణరెడ్డి వాపోయారు. తన కుమార్తె మెడికల్‌ సీటు కోసం దాచుకున్న డబ్బును కట్టేసి మోసపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన అనంతరం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. ‘‘డబ్బులు చెల్లించాలని దుగ్గాయపల్లె వీరారెడ్డిని ఎన్ని సార్లు అడిగినా రేపు రా! ఎల్లుండి రా! అని తిప్పుతున్నారు. మూడు నెలలు పాటు ఆయన చుట్టూ తిరిగా. చివరికి ఓపిక నశించి అపార్ట్‌మెంట్‌ రవి ద్వారా ఆయనకు ఫోన్‌ చేయించా. గట్టిగా అడిగితే... వాళ్ల చేత, వీళ్ల చేత ఫోన్‌ చేయిస్తావా? జగన్‌ వాళ్ల నాయనకు, జగన్‌ వాళ్ల అమ్మకు చెప్పుకో అంటున్నారు. నేను డబ్బులివ్వను అంటూ బెదిరిస్తున్నారు. నాకు వేరే వాళ్లు చెబితేనే ఆయన వద్దకు వెళ్లా...’’ అంటూ పోకల నారాయణరెడ్డి ఆ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆదినిమ్మాయపల్లెలో నాకు ఇచ్చిన ఇసుక రీచ్‌ దొంగది. విజిలెన్స్‌ అధికారులు వస్తున్నారు. ఇతర తనిఖీ బృందాలు వస్తున్నాయంటూ ఆపేశారు. నా నుంచి డబ్బు తీసుకుని ఇసుక తోలనివ్వలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయా...’’ అని ఆయన పేర్కొన్నారు.

అయిదుగురు భాగస్వాములు సబ్‌ లీజుకు తీసుకున్నారు: వీరారెడ్డి

‘‘అయిదుగురు భాగస్వాములు కలిసి నా వద్ద ఇసుక రీచ్‌ను సబ్‌ లీజుకు తీసుకున్నారు. నిర్వహణ సరిగ్గా చేయలేక కొన్ని రోజులకే తప్పుకున్నారు. ఆ అయిదుగురు బృందానికి నేను రూ.8 లక్షలు చెల్లించాలి. వారు టిప్పర్ల అద్దె, పెట్రోల్‌ బంకులో బకాయిల చెల్లించాల్సి ఉన్నందున ఆ సొమ్ము వారికి ఇవ్వలేదు. నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆ అయిదుగురి బృందంలో ఒకరనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. అందరూ కలిసి వస్తే ఆ బకాయిల విషయంలో ఎప్పుడో తేల్చేసే వాడిని. అనుమతి ఉన్న రేవులోనే వారికి ఇసుక తవ్వకానికి అవకాశమిచ్చా...’’ అని వీరారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని